అక్కా,బావతో కలిసి ప్రియుడి ఇంటి ముందు దీక్ష
వరంగల్(వెంకటాపూర్): ఓ యువతిని గర్భవతి చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడో ప్రబుద్ధుడు. వరంగల్ జిల్లావెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన గువ్వ శరత్, నర్సింహులుపేట మండలానికి చెందిన సలుగు కృష్ణవేణి(24) కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కృష్ణవేణి నగరంలోని విప్రో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. శరత్, కృష్ణవేణికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. తన అన్న పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోవడం బాగుండదని శరత్ 5 నెలల క్రితం కృష్ణవేణికి అబార్షన్ చేయించాడు.
తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నీకు వేరే వాళ్లతో సంబంధాలున్నాయని శరత్ పెళ్లి కుదరదన్నాడు. దీంతో కృష్ణవేణి తన అక్కా బావతో కలిసి ప్రియుడి ఇంటి ముందు శనివారం ఉదయం బైఠాయించారు. కృష్ణవేణి తనకు న్యాయం జరిగేవరకు అక్కడ నుంచి కదలనని భీష్మించుకుని కూర్చొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతున్నారు.