కనులపండువ..
- ఘనంగా నల్సార్ స్నాతకోత్సవం
- రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘన స్వాగతం
- 649మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
శామీర్‌పేట్ : మండలపరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ముఖ్యఅతిథిగా హజరై స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి ,నల్సార్ లా యూనివర్సిటీ చాన్స్‌లర్ క ళ్యాణ్ జ్యోతిసేన్ గుప్త సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 649 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం చేశారు.
వీరిలో పలువురికి ప్రశంసాపత్రాలతో పాటు బంగారు పతకాలను అందజేశారు. మొత్తం 48 బంగారు పతకాలకుగానూ బీఏఎల్ ఎల్‌బీ ఆనర్స్ పూర్తి చేసిన విద్యార్థిని కుమారి ప్రియంవదా దాస్ 11 బంగారు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించిన విజయాలను, విద్యా విషయాలను వివరించారు. నల్సార్‌లో ఇటీవల ఆరంభించిన చాయిస్ బేస్‌డ్ క్రెడిట్ సిస్టం ద్వారా విద్యార్థులు భిన్నమైన కేసుల వివరాలను తెలుసుకునే వీలు కలిగిందన్నారు.
తొలుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి హెలీకాప్టర్ సాయంత్రం 4 గంటలకు నల్సార్ లా యూనివర్సిటీలో ప్రత్యేకంగాఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగగా అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో స్నాతకోత్సవ ప్రాంగణానికి ఆయనను తీసుకువచ్చారు. శామీర్‌పేట్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు గవర్నర్ నరసింహాన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తలు వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో వారిని స్నాతకోత్సవ ప్రాంగణానికి తీసుకువచ్చారు.