తెలంగాణ విధాన సభలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని
హన్మకొండ :తెలంగాణ విధాన సభలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పట్టభద్రులను కోరారు. హన్మకొండలో ఆదివారం విలేకరుల సమావేశం అనంతరం హంటర్‌రోడ్డు సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్‌లో జరిగిన పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు విద్యావేత్త అని, సామాజిక సేవకుడన్నారు.
ఇలాంటి వ్యక్తి విధాన సభలో ఉన్నప్పుడే ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారన్నారు. బీజేపీ మద్దతుంటేనే తెలంగాణ వచ్చిందనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు అడ్డుకున్నామని అనడంలో వాస్తవం లేదన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర గొప్పదన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. టీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీలుంటే బిల్లు పెట్టినపుడు వారు పార్లమెంట్‌లో లేరని విమర్శించారు.
ఎంపీ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఉండాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, చింతాకుల సునీల్, వన్నాల శ్రీరాములు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రామగళ్ల పరమేశ్వర్, ప్రొఫెసర్ వెంకటనారాయణ, డాక్టర్ విజయలక్ష్మి, కీర్తిరెడ్డి, రవళి, శ్రీరాముల మురళీమనోహర్, రావుల కిషన్, గాదె రాంబాబు, ఎం.తిరుపతిరెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, టీడీపీ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, దొమ్మటి సాంబయ్య, ఈగ మల్లేశం, అనిశెట్టి మురళీమనోహర్, సాంబయ్య నాయక్ పాల్గొన్నారు.