నష్టాల పాలు! | Private Dairy Farms Loss in Lockdown Time Hyderabad | Sakshi
Sakshi News home page

నష్టాల పాలు!

Published Tue, Apr 21 2020 11:32 AM | Last Updated on Tue, Apr 21 2020 11:54 AM

Private Dairy Farms Loss in Lockdown Time Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అన్ని వయసులవారికీ పౌష్టికాహారం పాలు. గ్రేటర్‌కు వీటి సరఫరా సమృద్ధిగా ఉన్నా.. డిమాండ్‌ అంతంతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం పలు సహకార, ప్రైవేట్‌ పాల డెయిరీలకు నష్టాలనే మిగిలిస్తోంది. సాధారణ రోజుల్లో మహానగరానికి నిత్యం వివిధ డెయిరీలకు సంబంధించి సుమారు 30 లక్షల లీటర్ల పాల వినియోగం ఉండేది. లాక్‌డౌన్‌ అనంతరం డిమాండ్‌ అనూహ్యంగా పడిపోయింది. సకల వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాలు స్తంభించడంతో మెజారిటీ సిటీజన్లు పల్లెబాట పట్టడం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, టీస్టాళ్లు మూతపడడం, పాల ప్యాకెట్లు ఇంటింటికీ సరఫరా చేసే డెలివరీ బాయ్స్‌ అందుబాటులో లేకపోవడంతో డిమాండ్‌ సుమారు 10 లక్షల లీటర్ల మేర తగ్గిందని.. దీంతో సిటీకి అన్ని డెయిరీలు విక్రయించే పాలను కలిపినా వాస్తవ సరఫరా 20 లక్షల లీటర్లు మించడం లేదని పలు డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం గృహ వినియోగానికి సంబంధించిన పాల వినియోగంలో సుమారు 20 శాతం.. వాణిజ్య విభాగమైన హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లకు సరఫరా చేసే మొత్తంలో సుమారు 50 శాతం కోత పడిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

తగ్గిన డిమాండ్‌ ఇలా..
కోటికిపైగా జనాభా ఉన్న గ్రేటర్‌ నగరానికి నిత్యం సుమారు 57 సహకార, ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలకు చెందిన పాలు గతంలో సుమారు 30 లక్షలు.. ఇప్పుడు 20 లక్షల లీటర్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగంలో 20 శాతం.. వాణిజ్య విభాగంలో 50 శాతం వినియోగం తగ్గడం గమనార్హం. సాధారణంగా అన్ని వ్యవస్థీకృత డెయిరీలు విక్రయంచే పాలు 60 శాతం జనాభాకు సరఫరా అవుతున్నాయి. మరో 40 శాతం మందికి పాల విక్రయాలు ఇంటింటికీ స్కూటర్‌పై తిరిగి పాలను విక్రయించే వారు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి మిల్క్‌ వెండర్స్‌కు  డిమాండ్, సరఫరాలో పెద్దగా కోత పడలేదు. ప్రధానంగా డెయిరీ పాలపైనే లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మెజారిటీ సిటీజన్లు సొంత గ్రామాలకు వెళ్లడం, హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు మూతపడడం, డెలివరీ బాయ్స్‌ విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో డిమాండ్‌ తగ్గింది. 

పాల ఉత్పత్తులకు గిరాకీ అంతంతే..
పాలతో తయారయ్యే ఉత్పత్తులు పెరుగు, పన్నీర్, లస్సీ, స్వీట్స్‌ దూద్‌పేడా, ఐస్‌క్రీమ్స్, వెన్న తదితర ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ అనూహ్యంగా పడిపోయిందని పలు డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు. నగరంలో వివాహాది శుభకార్యాలు వాయిదాపడడం, ప్రజలు ఇంటి వంటకే ప్రాధాన్యమివ్వడం, బయటి నుంచి తిను బండారాలు కొనుగోలు చేసి తెచ్చుకునేందుకు విముఖత చూపడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వల్లభ డెయిరీ నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్‌ అంతగా లేకపోవడంతో పలు డెయిరీలు పాల పౌడర్, వెన్న తయారీ చేసే సంస్థలకు మిగిలిన పాలను సరఫరా చేస్తున్నాయన్నారు. పలు సహకార, ప్రైవేటు డెయిరీలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ప్రస్తుతం పలు ప్రధాన డెయిరీలు విక్రయిస్తున్న పాలు.. లీటర్లలో (రోజువారీగా)
గమనిక: సాధారణ రోజుల్లో ప్రస్తుతం విక్రయిస్తున్న పాలకంటే గృహ వినియోగంలో 20 శాతం, వాణిజ్య విభాగంలో 50 శాతం అధికంగా పాలను విక్రయించేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement