సాక్షి, హైదరాబాద్ : బెల్టు షాపులకు మద్యం సరఫరా విషయంలో వ్యాపారుల మధ్య గొడవలను నియంత్రించేందుకు ఎక్సైజ్ అధికారులు ఓ చట్ట విరుద్ధ పాలసీని అమల్లోకి తెచ్చారు. అధీకృత (ఏ4 షాపు) మద్యం దుకాణం చుట్టూ ఉన్న రెవెన్యూ గ్రామాలను ఒక గ్రూపులో చేర్చి, ఆయా గ్రామాల్లో బెల్టు దుకాణాలకు నిర్ధేశిత ఏ4 దుకాణం యాజమాన్యమే మద్యం సరఫరా చేయాలని ఒప్పందం చేయించారు.
ఈ ఒప్పందాన్ని అతిక్రమించకుండా పక్కాగా అమలు చేసేందుకు యాజమాన్యాలు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి లైసెన్స్‌డ్ దుకాణానికి నలుగురికి తగ్గకుండా ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నాయి.
బెల్టు షాపే తారక మంత్రం
ప్రభుత్వం మద్యం ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మిన దుకాణాలకు రూ.2 లక్షల జరిమానా, నెల పాటు లైసెన్స్ రద్దు చేస్తోంది. ఈ నిబంధన వ్యాపారులతోపాటు, ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఇబ్బందిగానే మారింది.
అదనపు సంపాదన లేక వ్యాపారులు నెల మామూళ్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏ4 దుకాణాల ద్వారా మద్యం విక్రయాల నెలవారీ టార్గెట్లను అందుకోలేకపోతున్నారు.దీంతో ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో 8,685 రెవె న్యూ గ్రామాలు, 21 వేల హాబిటేషన్లు ఉన్నా యి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున 5 చొప్పున, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున 65 వేలకు పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి.
రాష్ట్రంలోని మద్యం వ్యాపారంలో 60 శాతం బెల్టు దుకాణాల ద్వారానే నడుస్తోంది. ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని, ఇందులో 283.20 లక్షల కేసుల బ్రాందీ, విస్కీ, 349.42 లక్షల కేసుల బీరు, 0.82 లక్షల కేసుల విదేశీ మద్యం విక్రయించడం ద్వారా రూ.15,836 కోట్ల విలువైన వ్యాపారం చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మితే ఇందులో 40% మద్యం కూడా అమ్ముడవదు. దీంతో ప్రభుత్వం బెల్టు షాపులను ప్రోత్సహిస్తోంది.
దుకాణానికి నలుగురు
ఒప్పందం పక్కాగా అమలు చేసేందుకు దుకాణాల యాజమాన్యాలు ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి దుకాణానికి నలుగురు యువకుల చొప్పున చేర్చుకున్నారు. వీరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నారు. గ్రామాల్లోని బెల్టు దుకాణాలను నిత్యం పర్యవేక్షిస్తూ.. పక్క దుకాణాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారని తెలిస్తే దాడులు చేయటమే వాళ్ల పని.
మద్యం నిర్దేశిత దుకాణం లోనిదా? కాదా ? అని నిర్ధారించుకునేందుకు ‘వేర్ ఇట్’అనే ఎక్సైజ్ శాఖ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఫోన్స్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. బెల్టు దుకాణంలోని మద్యం సీసా మూతకు అతికించిన లేబుల్‌ను స్కాన్ చేస్తే ఆ సీసా ఏ లైసెన్స్‌డ్ దుకాణం నుంచి వచ్చిందో తెలిసిపోతుంది.
ఒకవేళ బెల్టు దుకాణాల నిర్వాహకులు ఒప్పందం అతిక్రమిస్తే ప్రైవేటు సైన్యం భౌతిక దాడులు చేస్తోంది. తర్వాత స్థానిక ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు వారి మీద అక్రమ మద్యం కేసులు నమోదు చేస్తున్నారు.
తరచూ గొడవలు
కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. దీంతో వ్యాపారులు బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే పనిలో పడ్డారు. ప్రతి క్వార్టర్‌కు ప్రస్తుతానికి ఎంఆర్పీ మీద రూ.2 అదనంగా వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఒకే మండలంలో రెండు,మూడు మద్యం దుకాణాలు ఉన్న చోట బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే విషయంలో తరచుగా గొడవలు తలెత్తుతున్నాయి. ఈ గొడవలను నివారించటం కోసం స్థానిక ఎక్సైజ్ పోలీసులు మధ్య వర్తిత్వం చేసి గ్రామాలను విభజించి పరిధిని నిర్ధారించారు. నిర్ధారించిన గ్రామా ల్లోని బెల్టు దుకాణాలకు మాత్రమే మద్యం సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment