ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఆశ్రమాలకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్‌శాఖలను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆస్తి పన్ను మినహాయింపునకు వీలుగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలకశాఖ, పంచాయతీరాజ్‌శాఖలు చర్యలు చేపట్టాయి. చట్ట సవరణ జరిగి ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.