పదిరోజుల్లో మారాలి: సీఎం కేసీఆర్‌ | CM KCR Review Meeting with District Collectors And Municipal Officials | Sakshi
Sakshi News home page

పదిరోజుల్లో మారాలి: సీఎం కేసీఆర్‌

Published Mon, Jun 14 2021 1:13 AM | Last Updated on Mon, Jun 14 2021 11:29 AM

CM KCR Review Meeting with District Collectors And Municipal Officials - Sakshi

జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లకు కేటాయించిన కియా కార్లను ఆదివారం ప్రగతి భవన్‌లో పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సీఎస్‌ సోమేశ్‌ తదితరులు

జిల్లాను దత్తత తీసుకుంటా...
నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుని, పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటా. అదనపు కలెక్టర్, నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం 

24 అంతస్తుల్లో ఆస్పత్రి..
వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో 24 అంతస్తులతో, ఆధునిక సదుపాయాలతో గ్రీన్‌ బిల్డింగ్‌గా మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తం. వైద్యం కోసం రోగులు హెలికాప్టర్‌లో వచ్చి దిగేందుకు వీలుగా ఆస్పత్రి భవనంపై హెలిప్యాడ్‌ నిర్మిస్తం. 

సాక్షి, హైదరాబాద్‌: పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపించేందుకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులు కంకణబద్ధులు కావాలని... గ్రామాలు, పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్‌ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ప్రకటించారు. తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉందని, ఏమైనా తప్పులుంటే ఆలోగా సరిదిద్దుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం రాష్ట్రంలోని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. 


కావలసినంత సమయమిచ్చా.. 
పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) కష్టపడి పనిచేస్తున్నా ఆశించినంత పని జరగట్లేదని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. కావలసినంత సమయమిచ్చాకే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నానని, దానికి ముందు మరోసారి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుందామని సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు.  గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులు, సర్పంచులను సస్పెండ్‌ చేయాలని, ఈ విషయంలో అధికార పార్టీ వారు అని కూడా చూడవద్దని కేసీఆర్‌ సూచించారు. టీఆర్‌ఎస్‌ సర్పంచులు తప్పు చేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి అదనపు కలెక్టర్‌కు తక్షణమే రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.  
అభివృద్ధి కోసం అందరి భాగస్వామ్యం 
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధి సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను ఒక జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హరితహారం ప్రారంభించిన పది పదిహేను రోజుల్లో అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను పూర్తి చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. 


ఆదివారం ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్‌ సోమేశ్‌  


24 అంతస్తులతో వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి 
వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో అద్భుతమైన మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 24 అంతస్తులతో, ఆధునిక సాంకేతిక సదుపాయాలతో, గ్రీన్‌ బిల్డింగ్‌గా ఆ ఆస్పత్రిని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యం కోసం రోగులు హెలికాప్టర్‌లో వచ్చి దిగేందుకు వీలుగా ఆస్పత్రి భవనంపై హెలీప్యాడ్‌ నిర్మించాలని సూచించారు. కెనడా మోడల్‌లో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్‌ వెంటిలేషన్‌ పద్ధతుల్లో ఆస్పత్రి నిర్మాణం జరగాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు కెనడాలో పర్యటించి రావాలన్నారు.  


మొదట ప్రేమగా.. వినకుంటే కఠినంగా.. 
మొదట సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రేమగా ఉండాలని, మంచిగా, సముదాయించి చెప్పాలని.. అభిమానంతో పనిచేయించుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. అలా వినకుంటే కఠినంగా మారాలన్నారు. ‘‘నయమున ప్రాలుందాగరు, భయమున విషమైన భుజింతురు అని సామెత ఉంది. మంచిగా బతిమాలి చెప్తే కూడా కొన్ని కొన్ని సార్లు వినరు. అప్పుడు నర్సింహావతారం ఎత్తక తప్పదు’’ అని చెప్పారు. గ్రామాభివృద్ధిలో కేరళను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కొందరు అదనపు కలెక్టర్లు, డీపీవోలను ఎంపిక చేసి కేరళకు పంపి పరిశీలన చేయించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలుచేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకుందని.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ, తెలియని విషయాలను తెలుసుకోవడానికి అహంభావం ఉండకూడదని సీఎం పేర్కొన్నారు.  


లేఅవుట్ల విషయంలో జాగ్రత్త 
నర్సరీలు, వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్లు, పబ్లిక్‌ టాయిలెట్లు, వైకుంఠ ధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతి పట్టణానికి ఒక స్టేటస్‌ రిపోర్టు తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పట్టణాల్లో లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాల్స్, ట్రాన్స్‌ ఫార్మర్లు, సబ్‌ స్టేషన్లు, వాటర్‌ ట్యాంకులు వంటి అవసరాలకు కేటాయించిన స్థలాలను స్థానిక మున్సిపాలిటీ పేరు మీద రిజిస్టర్‌ చేయించాలని ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణ కోసం మాస్టర్‌ ప్లాన్లను నవీకరించాలని సూచించారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్‌ రికార్డ్స్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలన్నారు.  

సేవ్‌ ది విలేజెస్‌.. సేవ్‌ యువర్‌ సెల్ఫ్‌ 
గ్రామ సభలు నిర్వహించి, గ్రామాల ఆర్థిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీపీవోలదేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పంచాయతీ ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్‌ కిస్తీల చెల్లింపులు, గ్రీన్‌ కవరేజీ కోసం ఖర్చులు అన్న ‘చార్జ్‌డ్‌ అకౌంట్‌’ కిందికి వస్తాయని.. వాటికి ముందు నిధులు కేటాయించాకే మిగతా ఖర్చులు చేసుకోవాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిపక్షంలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని సూచించారు. ‘సేవ్‌ ది పీపుల్‌.. సేవ్‌ ది విలేజెస్‌.. సేవ్‌ యువర్‌ సెల్ఫ్‌’ అనే నినాదంతో పనిచేయాలన్నారు. పనితీరు సరిగా లేనివారికి షోకాజ్‌ నోటీసులు పంపాలని, తాత్సారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


సీజనల్‌ వ్యాధులపై ముందస్తు చర్యలు 
జిల్లా, మండల, పీహెచ్‌సీ స్థాయిల్లో సీజనల్‌ వ్యాధుల నిర్మూలనపై వైద్య, పంచాయాతీరాజ్, మున్సిపల్‌ శాఖల అధికారులు ముందస్తుగా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. మలేరియాలో ప్రీఎలిమినేషన్‌ దశ నుంచి ఎలిమినేషన్‌ (నిర్మూలన) దశకు చేరుకున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఇవే పద్ధతులు అవలంబిస్తే మరో మూడేళ్లలో మలేరియా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement