ఆస్తిపన్ను @ రూ.101
దిగువ, మధ్య తరగతి ఇళ్ల యజమానులకు ఆస్తిపన్ను తగ్గింపు
5.09 లక్షల మందికి ప్రయోజనం
అమలుకు కమిషనర్‌కు అధికారం
జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఏటా రూ. 30 కోట్లు లోటు
పాతబకాయిలు మరో రూ. 57.99 కోట్లు
సిటీబ్యూరో: ఇళ్ల ఆస్తిపన్ను తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నిర్ణయంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను ద్వారా ఏటా వచ్చే ఆదాయంలో దాదాపు రూ. 30 కోట్లు తగ్గనుంది. ఇప్పటి వరకున్న బకాయిలు మరో రూ. 57.99 కోట్లకు గండిపడనుంది. ప్రస్తుతం ఇళ్ల ఆస్తిపన్ను రూ. 1200 లోపు ఉన్నవారికి కేవలం రూ. 101లు ఆస్తిపన్నుగా చెల్లిస్తే చాలని ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేస్తూ..దానిని అమలు చేసే అధికారాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. యజమానులే నివాసం ఉంటున్న నివాస గృహాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఏర్పడే లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించదని కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలకు రాయితీలు కల్పించినప్పుడు సంబంధిత సంస్థలకు తగ్గే ఆదాయాన్ని పూడ్చేందుకు రాష్ట్రప్రభుత్వం పరిహారం రూపేణా అందజేయడం.. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయడం రివాజు.
జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు దాదాపు 13.50 లక్షల మంది ఉండగా, వారిలో 5.09 లక్షల మందికి ఈ సదుపాయం వర్తించనుంది. వీరంతా రూ. 1200 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారే కావడం గమనార్హం.
నోట్: జీహెచ్‌ఎంసీ పాత (18)సర్కిళ్ల వారీగానే ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి. వీటినే 24 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. {పభుత్వ తాజా నిర్ణయంతో ఈమేరకు జీహెచ్‌ఎంసీ ఖజానాకు లోటు ఏర్పడనుంది.