- 2016 నుంచే అమలు చేయాలని ప్రభుత్వ లక్ష్యం
- పరిశ్రమల కోసం ప్రత్యేక గ్రిడ్
- మూడేళ్ల వ్యవధిలోనే మిగులు ప్రణాళిక
- 2018 నాటికి 23675 మెగావాట్లు టార్గెట్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి పగటి పూట వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను పగలు, రాత్రి వేళల్లో రెండు విడతలుగా అందిస్తున్నా రు. కొరత ఎక్కువగా ఉన్న సమయంలో మూ డు విడతలుగా కూడా సరఫరా చేస్తున్నారు. దీంతో రాత్రి పూట రైతులు పొలాల వద్ద జాగరణ చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో చీకట్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను పూర్తిగా పగటి పూట సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ తెలంగాణ జెన్‌కో, డిస్కం అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ప్రస్తుతం విద్యుత్ కొరత ఉండటంతో ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం సాధ్యం కాకపోవటంతో.. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని కేసీఆర్ సూచించారు.
వ్యవసాయానికి ఇచ్చే 7 గంటల విద్యుత్‌ను ఒకవేళ రెండు విడతలుగా సరఫరా చేసినా ఉదయం నుంచి చీకటి పడేలోగా వీటిని షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్ సమస్య ప్రధాన అవరోధంగా మారిం దని, అందుకే పరిశ్రమలకు కోత లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు భరోసా కల్పించాలని యోచిస్తోం ది. ఇందులో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసే ఇండస్ట్రియల్ పార్కుల్లో మినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని... హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమలకు ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ జెన్‌కోకు సూచిం చింది.
తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రం గా తీర్చిదిద్దేలా టీఎస్ జెన్‌కో రూపొందించిన ప్రతిపాదనలపై ఇటీవల సీఎం సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా రాబోయే మూడేళ్లలోనే సరిపడేంత విద్యుత్ ఉంటుందని.. ఒక్కో ఏడాదికి సంబంధించిన మైలు రాళ్లను టీఎస్ జెన్‌కో సీఎంకు అందించింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణలో జెన్‌కో, కేంద్ర విద్యుత్ ప్లాంట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా మొత్తం 4320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి వరకు మరో 2359 మెగావాట్లు అదనంగా సమకూరుతుంది.
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో దశ, సింగరేణి పవర్ ప్లాంట్, భద్రాచలం థర్మల్ పవర్ ప్లాంట్, థర్మల్ టెక్ ప్రాజెక్టుల ద్వారా ఈ విద్యుత్ వస్తుందని టీఎస్ జెన్‌కో నివేదించింది. 2016లో ఛత్తీస్‌గఢ్ నుంచి రెండు వేల మెగావాట్లు కలుపుకొని మొత్తం 3230 మెగావాట్లు అదనంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. 2017 చివరి వరకు కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఏడో దశ పూర్తయితే 836 మెగావాట్లు, 2018లో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్లు, నల్లగొండలో నిర్మించనున్న దామరచెర్ల పవర్ ప్లాంట్ ద్వారా 4400 మెగావాట్లు, సింగరేణి రెండో దశ విస్తరణతో 800 మెగావాట్లు.. మొత్తంగా 9488 మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుం దని ప్రణాళికలు రూపొందించింది.
మొత్తంగా థర్మల్ ప్లాంట్ల ద్వారా 20233 మెగావాట్లు సమకూరుతుందని.. అప్పటికే జలవిద్యుత్ ఉత్పత్తి 2442 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇప్పుడున్న జలవిద్యుత్ కేంద్రాలకుతోడు ఈ ఏడాది చివరిలోగా లోయర్ జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని జెన్‌కో భావిస్తోంది. వీటికితోడు కనీసం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ రానుండటంతో 2018 డిసెంబర్ నాటికి... మొత్తం 23675 మెగావాట్ల లక్ష్యం నెరవేరుతుందని అంచనా వేసింది.