దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన జి.ఎన్.రెడ్డికి ప్రథమ బహుమతి అందజేస్తున్న మంత్రి, సీపీ అంజనీకుమార్
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆర్టీసీ ఉద్యోగుల భద్రతే మా ప్రధాన అజెండా అని, ఏ ఉద్యోగినీ అకారణంగా తొలగించకూడదనేది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్‌ను సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సుదీర్ఘకాలంగా ఎలాంటి ప్రమాదాలు చేయని డ్రైవర్లను రోడ్డు భద్రత అవార్డులతో పాటు నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రయాణ మే సురక్షితమైందని అన్నారు. తాగి వాహనాలు నడపటం, వేగంగా నడపటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆర్టీసీని మనం రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుందని చెప్పారు.
డ్రైవర్ల భాగస్వామ్యంతోనే..
ఆర్టీసీ అభివృద్దిలో డ్రైవర్ల భాగస్వామ్యం కూడా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.ప్రమాదాలు జరగకుండా చూడటమే కాదని, ప్రయాణికులతో మాట్లాడే తీరూ ముఖ్యం అన్నారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ప్రజా రవాణాలో ఆర్టీసీ అత్యంత ముఖ్యమైంది, భద్రతతో కూడుకుందన్నారు.
అనంతరం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన జి.ఎన్.రెడ్డికి స్టేట్ ప్రథమ, మిర్యాలగూడ డిపోకు చెందిన ఎ.ఎస్.ఎన్.రెడ్డికి స్టేట్ ద్వితీయ, సికింద్రాబాద్ కుషాయిగూడ డిపోకు చెందిన కె.ఆర్.రెడ్డిలకు స్టేట్ తృతీయ బహుమతితో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. జోనల్, రీజియన్ల వారీగా ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment