రాజేంద్రనగర్: ‘క్యూఆర్ కోడ్’.. డబ్బులు చెల్లించేందుకు.. అకౌంట్‌లో వేసేందుకు అతి సులువైన విధానం. ఇప్పుడు ఈ ‘కోడ్’ను చెత్త సేకరణకూ అనుసంధానించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మన జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్ సర్కిల్–11లో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుని జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ ఆంజనేయులు బుధవారం ‘స్వచ్ఛ్ గృహ క్యూఆర్ కోడ్’ ద్వారా చెత్త సేకరణను లాంఛనంగా ప్రారంభించారు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లో 1200 నివాసాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన చెత్త చెదారాలను ప్రతిరోజూ ఆటో రిక్షా కార్మికుడితో పాటు అతడి హెల్పర్ సేకరిస్తున్నారు. ఐటీసీ సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా అర్బన్ రిబాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఈ క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. దీన్ని 1200 కుటుంబాల్లో ప్రతి ఇంటికీ ఏర్పాటు చేశారు. వారి పూర్తి వివరాలను సేకరించి క్యూఆర్ కోడ్‌కు అనుసంధానించారు.
ప్రతిరోజు చెత్త సేకరించే కార్మికుడు వీరి ఇళ్లకు వెళ్లి తన సెల్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెత్తను సేకరిస్తాడు. కోడ్‌ను స్కాన్ చేయగానే అందులో ఇంటి యజమాని పేరుతో పాటు తడి, పొడి చెత్త వేరు చేశారా, లేదా, ఇంటికి తాళం వేసి ఉందా, చెత్తను ఇచ్చేందుకు తిరస్కరించారా, ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారా, నెల వారి డబ్బు చెల్లించారా లేదా.. ఇలాంటి ఆరు ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఒకటి సెలక్ట్ చేసి సడ్మిట్ చేస్తాడు. దీంతో దానికి సంబంధించిన పూర్తి డేటా నిక్షిప్తమవుతుంది. దీని ద్వారా ఇంటి యజమానితో పాటు కార్యాలయంలోని అధికారులకు ఆ అపార్ట్‌మెంట్‌లోని ఇంటి యజమాని చెత్త ఎలా ఇస్తున్నాడో వివరాలన్నీ చేరుతాయి. చెత్త సేకరణదారు ప్రతిరోజు వారి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నాడా లేదా అన్న సమాచారంతో పాటు తడి పొడి చెత్తను ఇట్లోవారు ఎలా ఇస్తున్నారో ఈ విధానం ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ సందర్భంగా ఉప కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ అంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా జీహెచ్‌ఎంసీ క్యూఆర్ బార్ కోడ్‌తో చెత్త సేకరణను ప్రారంభించిందని, జనప్రియలో ప్రారంభించిన ఈ విధానం పనితీరును పరిశీలిస్తామన్నారు. మొదటి రోజు చెత్త సేకరణ విజయవంతంగా పూర్తి చేశామని, బార్ కోడ్ సైతం ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాఫీగా ఉందన్నారు. చెత్త సేకరించే నిరక్షరాశులకు సైతం ఈ విధానం చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో కోడ్‌ను రూపొందించామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పరిశీలించి రానున్న రోజుల్లో సర్కిల్ పరిధిలోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీహాల్స్, విల్లాలకు అనుసంధానం చేస్తామని, అనంతరం బస్తీలు, కాలనీల్లో ఇళ్లకు వర్తింపజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment