కొంటామంటూ.. కొల్లగొడుతున్నారు! | Cyber Criminals New Technic in Money Transfer | Sakshi
Sakshi News home page

కొంటామంటూ.. కొల్లగొడుతున్నారు!

Published Fri, Oct 18 2019 11:50 AM | Last Updated on Fri, Oct 18 2019 11:50 AM

Cyber Criminals New Technic in Money Transfer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓఎల్‌ఎక్స్‌లో వాహనాలు, వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ప్రకటనలు పెట్టడం.. బేరసారాల తర్వాత ఓ రేటు ఖరారు చేసుకుని ఆ మొత్తమో, అడ్వాన్సో కాజేయడం.. ఈ తరహా మోసాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ కొత్త పంథాలో సైబర్‌ క్రైమ్‌ వెలుగులోకి వచ్చింది. ఇక్కడా సైబర్‌ నేరగాళ్లు ఓఎల్‌ఎక్స్‌నే ఆధారంగా చేసుకున్నారు. అయితే ఈసారి తాము పలాన వాటిని కొంటామంటూ.. ఖాతాలోని సొమ్మును కొల్లగొడుతున్నారు. గూగుల్‌ పే క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా జరిగిన ఈ వ్యవహారంపై బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ నేతృత్వంలోని బృందం ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేస్తోంది. 

చెల్లిస్తామంటూ.. స్వాహా..
హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సంజయ్‌ భట్నాగర్‌ వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌. అతను తన వద్ద ఉన్న పుస్తకాల్లో కొన్నింటిని విక్రయించాలని భావించాడు. వాటిని రూ.5 వేలకు అమ్ముతానంటూ ఈ–కామర్స్‌ సైట్‌ ఓఎల్‌ఎక్స్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి సంజయ్‌కు ఫోన్‌ చేశారు. ట్రూ కాలర్‌ యాప్‌ ప్రకారం అతడి పేరు శ్రీనాథ్‌ బుర్మాగా సంజయ్‌ గుర్తించాడు. ఎలాంటి బేరసారాలు చేయని శ్రీనాథ్‌ ఆ పుస్తకాలన్నీ తనకు నచ్చాయని, వాటిని ఖరీదు చేయడానికి సిద్ధమేనంటూ అంగీకరించాడు. ఆర్మీలో పని చేస్తున్న తాను హైదరాబాద్‌ బయట ఉన్నానని, నగదును గూగుల్‌ పే యాప్‌ ద్వారా చెల్లిస్తానంటూ చెప్పాడు. అందుకుగాను ఆ యాప్‌కు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ పంపాలని సంజయ్‌ని కోరాడు. ఈయన కోడ్‌ పంపగానే డబ్బు రావడానికి బదులు ఖాతాలో ఉన్న మొత్తం పోయింది. నసీబ్‌ ఖాన్‌ అనే వ్యక్తికి చెందిన గూగుల్‌ పే ఖాతాలోకి రూ.40 వేలు నాలుగు దఫాల్లో బదిలీ అయినట్లు గుర్తించారు. తనకు నగదు రావాల్సి ఉండగా తన డబ్బు పోవడంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే అతడి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు వినియోగించిన సెల్‌ఫోన్‌ నంబర్‌తో పాటు గూగుల్‌ పే ఖాతాకు జత చేసిన నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.  

‘రిక్వెస్ట్‌’కు బదులుగా ‘పే’ ఎంచుకోవడంతో..
ఈ వ్యవహారంలో నిందితుల మాట విని బాధితుడు చేసిన చిన్న పొరపాటు ఫలితంగానే డబ్బు కోల్పోయినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఆ స్కామ్‌ జరిగిన తీరును ఇలా వివరిస్తున్నారు. గూగుల్‌ పే ద్వారా ఎవరి నుంచైనా డబ్బు పొందాలంటే యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ముందుగా వారి నంబర్‌ను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయిన తర్వాత డబ్బు చెల్లించాల్సింగా కోరుతూ ఎదుటి వ్యక్తి నంబర్‌కు యాప్‌ ద్వారానే ‘రిక్వెస్ట్‌’ పంపాల్సి ఉంటుంది. అందులో ఉన్న మొత్తాన్ని సరిచూసుకునే ఎదుటి వ్యక్తి అంగీకరిస్తే ఆ డబ్బు ఇవతలి వ్యక్తి గూగుల్‌ పే ఖాతాలోకి వస్తుంది. అలా కాకుండా డబ్బు పొందాల్సిన వ్యక్తి పొరపాటునో, ఎదుటి వారు చెప్పిన మాటల వల్లో పడో ‘పే’ అంటూ పంపించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని అవతలి వ్యక్తి ‘డినైడ్‌’ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ అంగీకరిస్తే తాను చెల్లించాల్సింది పోయి తన ఖాతాలోకే డబ్బు వస్తుంది. సంజయ్‌ తన గూగుల్‌ పే క్యూఆర్‌ కోడ్‌ను ఇలానే పొరపాటున పంపి ఉంటారని, దానిని సైబర్‌ నేరగాళ్ళు తమకు అనుకూలంగా వాడుకుని నాలుగు దఫాల్లో రూ.40 వేలు కాజేశారని దర్యాప్తు అధికారులు వివరించారు. ఈ విషయాన్ని ప్రతి వినియోగదారుడు దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఆయా యాప్స్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement