జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యా నాణ్యత నేతిబీరలో నెయ్యిచందంగా ఉందనే విషయం వాటిలో చేరిన విద్యార్థుల సంఖ్యను
బ్రాంచికి ముగ్గురు నుంచి నలుగురే
వర్సిటీ అన్ని వసతులు ఉన్నాయన్న కళాశాలల్లోనూ పూర్తిస్థాయిలో చేరని విద్యార్థులు
కోదాడటౌన్ : జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యా నాణ్యత నేతిబీరలో నెయ్యిచందంగా ఉందనే విషయం వాటిలో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టే తేలిపోయింది. జేఎన్‌టీయూ అధికారులు తనిఖీలమీద తనిఖీలు చేసి అన్ని వసతులు ఉన్నాయని వేల సీట్లకు అనుమతులు ఇచ్చిన కళాశాలల్లో 10నుంచి 20 మంది విద్యార్థులు చేరగా సరైన వసతులు లేవని అనుమతులు నిరాకరించిన కళాశాలల్లో మాత్రం వందల సంఖ్యలో విద్యార్థులు చేరడం అధికారుల తనిఖీలలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కొన్ని కళాశాలల్లో సున్నా అడ్మిషన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలుపరిస్థితి ఏమిటంటే...
జిల్లాల్లో 41 ఇంజనీరింగ్ కళాశాలలుండగా వాటిలో 7 కళాశాలలు కౌన్సెలింగ్‌కు ముందే తాము కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. మిగిలిన 34 కళాశాలల్లో 21 కళాశాలలకు మాత్రమే జెఎన్‌టీయూ అనుమతులు ఇవ్వగా 13 కళాశాలలు కోర్టు తీర్పుద్వారా షరతులతో కూడిన అనుమతులు పొందాయి. వీటిలో మొత్తం 10,500 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 1,850 సీట్లు మాత్రమే నిండాయి. 20 సీట్లకు లోపు నిండిన కళాశాలలు 13 ఉండగా 50 సీట్లకు పైగా నిండిన కళాశాలలు మరో 15 ఉన్నాయి. 100లోపు సీట్లు నిండిన కళాశాలలు రెండు ఉండగా, 200 సీట్లకు పైగా నిండిన కళాశాలలు రెండు మాత్రమే ఉన్నాయి.
విజ్ఞాన్‌లో అత్యధికం...
జిల్లాలో ఉన్న ఇంజనీరిగ్ కళాశాలల్లో అత్యధికంగా దేశ్‌ముఖిలో ఉన్న విజ్ఞాన్ ఇంజనీరింగ్‌లో అత్యధికంగా విద్యార్ధులు చేరారు. ఇక్కడ అత్యధికంగా718 మంది విద్యార్థులు చేరారు. ఇక ఆ తరువాత కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో 268 మంది, నల్లగొండలో రామానంద తీర్థ కళాశాలలో 193 మంది భువనగిరి అరోర కళాశాలలో 189 మంది విద్యార్థు చేరారు. నల్లగొండలోని ఎంజీయూ కళాశాలలో 180 సీట్లకు గాను 180 సీట్లు నిండాయి. ఇక కోదాడలో ఉన్న కిట్స్ మహిళా కళాశాలలో మాత్రం 90 మంది విద్యార్ధులు చేరారు.
దీని భావమేమిటో అధికారులే చెప్పాలి....
సౌకర్యాలు సక్రమంగా లేవని,అధ్యాపకులు లేరని వర్సిటీ అధికారులు తేల్చి అనుమతులు ఇవ్వని కళాశాలల్లోనే విద్యార్థులు అత్యధికంగా చేరడం గమనించదగ్గ విషయం. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని కౌన్సెలింగ్‌లో పాల్గొన్న ఈ కళాశాల వైపే విద్యార్థులు నమ్మకం ఉంచారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నడుస్తున్న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు అధికారులు కేవలం 60 సీట్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. కానీ ఇక్కడ 110 మంది విద్యార్థులు చేరారు. ఇక కోదాడలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు కేవలం 240 సీట్లకు మాత్రమే అనుమతులు ఇవ్వగా అక్కడ 269 మంది విద్యార్థులు చేరారు. జిల్లాలో అత్యధిక విద్యార్థులు చేరిన రెండో కళాశాల ఇదే కావడం గమనించదగ్గ విషయం.