
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, సూర్యాపేటలలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కాలేజీలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి అధి కారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
నల్ల గొండ, సూర్యాపేటల్లో ప్రస్తుతం నడుస్తున్న వైద్యశాలల పరిధిలో ఉన్న భూమి సరిపోదని, ఒక్కో మెడికల్ కాలేజీకి కనీసం 20 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణాలు, వైద్యశాలల నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. జూలై 7లోపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతుల కోసం అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు.