
బ్రాండ్.. ఓరుగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుందని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విషయంలో ప్రస్తు తం హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని... ఈ రంగంలో రెండో పెద్ద నగరంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ఆకాంక్ష మేరకు ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ బ్రాండ్ నగరంగా అభివృద్ధి చెందనుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ శివారులోని మడికొండలో కాంగ్రెస్ శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించింది.
ఈ నేపథ్యంలో మొదటిసారిగా జిల్లాకు వచ్చిన రాహుల్‌గాంధీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఇప్పుడు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తోంది యువతీయువకులే. అంగీ, ప్యాంటు, మొబై ల్... ఇలా ఎన్నో కొంటున్నారు. ఇవన్నీ చైనాలో తయారైనవే. అంటే... ఇక్కడి యువత చెల్లిస్తున్న డబ్బులు చైనాకే పోతున్నారుు. తెలంగాణ ప్రజల సొమ్ము పక్కదేశానికి తరలుతోం ది. అలా కాదు...తెలంగాణలోనే అన్ని తయారు కావాలి. వరంగల్‌లోనూ ఇది జరగాలి. ఇక్కడి ప్రజలు ఉపాధి, అభివృద్ధి బాట పట్టాలి. మొత్తంగా తెలంగాణ ఒక బ్రాండ్‌గా ఉండాలి.
వరంగల్ బ్రాండ్‌గా అభివృద్ధి చెందాలి. ఇక్కడ తయారైన గడియారాన్ని నా చేతికి పెట్టుకోవాలని ఆశిస్తు న్నా’ అని అన్నారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లాను అభివృద్ధి చేశామని, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐటీ పార్క్ నెలకొల్పామని చెప్పారు. ఎంజీఎంను ఎయిమ్స్ స్థాయికి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. స్వయం సమృద్ధి విషయంలో తెలంగాణ మహిళలు దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియూడారు.
ఇంటిని చక్కదిద్దుకున్న మహిళలకు దేశానికి నడిపించే శక్తి ఉందని... వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని, లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో కల్పిస్తామన్నారు. తెలంగాణలో నాలుగు వేల మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఆకా శం కింద పడినా... ఇచ్చిన మాట తప్పబోమన్నారు.
నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీని ఆదరించినట్లుగానే తననూ ఆదరించాలని జిల్లా ప్రజలను కోరా రు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్ర సంగం ఆరంభంలో రాహుల్‌గాంధీ బంజారాలకు రాంరాం అని అనడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి. రాహుల్ హిందీ ప్రసంగాన్ని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తెలుగులోకి అనువదించారు.
నేతల హడావుడి
వేదికపై పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మంత్రి బలరాంనాయక్ రాహుల్‌గాంధీకి చెరో పక్కన కూర్చున్నారు. పొన్నాల, బలరాంనాయక్ ప్రసంగిస్తున్న సేపు రాహుల్ పక్కన బస్వరాజు సారయ్య కూర్చునున్నారు. రెండో వరుసలో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. వీరి వెనుక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కొద్దిసేపు నిల్చున్నారు. తర్వాత కుర్చీలు తెప్పించుకుని కూర్చున్నారు.
సభ మధ్యలో కాసేపు మాజీ మంత్రి రెడ్యానాయక్ వేదికపై కూర్చున్నారు. రాహుల్ సమక్షంలో పరిచయ కార్యక్రమం ఉంటుందని భావించి వేదిక ఎక్కిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు నిరుత్సాహపడ్డారు. పాలకుర్తి అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు, పరకాల అభ్యర్థి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ పశ్చిమ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణ, మహబూబాబాద్ అభ్యర్థి ఎం.కవితను మాత్రమే పరిచయం చేసి రాహుల్ హడావుడిగా వెళ్లిపోయారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా రూపొందించిన రాజీవ్‌గాంధీ విగ్రహంతో ఉన్న జ్ఞాపికను బహూకరించారు.
పదనిసలు
రాహుల్‌రాక ముందే హెలికాప్టర్ కన్పించడంతో ఒక్కసారిగా సభలోని జనం గొల్లుమన్నారు.
హెలిపాడ్ వద్ద రాహుల్‌కు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, నాయిని రాజేందర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య స్వాగతం పలికారు.
హెలికాప్టర్ దిగగానే రాహుల్‌కు పలువురు జిల్లా నేతలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పరిచయం చేశారు. ఓ మహిళ రాహుల్‌కు తిలకం దిద్ది స్వాగతం పలికారు.
టీ పీసీసీ అధ్యక్షుడు సభ మధ్యాహ్నం 2.30 గంటలకని ప్రకటించారు. జనమొచ్చినా... రాహుల్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పటివరకు కళాకారులు ఆటపాటలతో జనాన్ని అలరించారు.
మండుటెండ, ఉక్కపోతలో కదిలితే అడ్డుకునే పోలీసుల మధ్య కనీసం మంచినీళ్లు పెట్టాలనే విషయూన్ని మరిచిపోయారు కాంగ్రెస్ నాయకులు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు.
వేదికపైకి రాహుల్‌కంటే ముందు పొన్నాల, కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరుకున్నారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, జిల్లా అధ్యక్షడు నాయినిని తప్ప ఇతరులను వేదికపైకి ఎస్పీజీ అనుమతించలేదు.
రాహుల్ అభివాదం చేయగానే సభలో కొత్త ఉత్సాహం కన్పించింది. సిరిసిల్ల రాజయ్య అభివాదం చేయగానే జనంలో నవ్వులు విరిశాయి.
పొన్నాల సుదీర్ఘ ప్రసంగం చేస్తుండగా దిగ్విజయ్‌సింగ్ రెండుసార్లు దగ్గరకు వచ్చి సైగ చేయడంతో పొన్నాల ప్రసంగం ముగించారు.
రాహుల్ ప్రసంగానికి ముందు దిగ్విజయ్‌సింగ్ రెండు, మూడు పర్యాయాలు ఆయన వద్దకు వచ్చి పలు సూచనలు చేశారు.
రాహుల్ ప్రసంగం ప్రారంభించే సమయంలో రాం రాం అంటూ బంజారాలకు అభివాదం చేశారు.
రాహుల్ ప్రసంగం ముగించి వెళ్లిపోతుండగా,ఒక నిమిషమని పొన్నాల అభ్యర్థించారు. అభ్యర్థుల పరిచయం ఉంటుందని పేర్లు చదువుతున్నారు. అందరు అభ్యర్థులు రాక ముందే రాహుల్‌తో వేదిక పై ఉన్న వారు అభివాదం చేశారు. ఆ సమయంలో పొన్నాల వారితో లేకుండా పోయారు. ఆ తర్వాత పోటీలో ఉన్న ఎంపీ అభ్యర్థులు బల రాంనాయక్, సిరిసిల్ల, ఎమ్మెల్యే అభ్యర్థులు బస్వరాజు సారయ్య, గండ్ర, రెడ్యా, మాలోతు కవిత, కొండేటి, పొదెం వీరయ్య, విజయరామారావు, దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లి స్వర్ణ, కత్తి వెంకటస్వామిగౌడ్, ఇనుగాల వెంకట్రామిరెడ్డిని రాహుల్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా కవిత ఫొటో తీసేందుకు యత్నించారు.