ఒకటే వాన
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్
- గంటలకొద్దీ నిలిచిపోయిన వాహనాలు
- నీట మునిగిన కాలనీలు
సాక్షి, సిటీబ్యూరో: సాయంత్రం 6.30 గంటలు... నాంపల్లి నుంచి పంజాగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జడివాన కురియడంతో లక్డికాపూల్ నుంచి పంజాగుట్ట వరకు వేలాది వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ రద్దీలో పంజాగుట్ట చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టింది. రాత్రి 8 గంటలకు గానీ గమ్యం చేరలేకపోయాడు.
రాత్రి 7 గంటలు...అమీర్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు స్నేహ బస్సు లో బయలుదేరింది. రాత్రి 9.50 గంటలకు గానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోలేదు.
హైటెక్ సిటీ నుంచి సాయంత్రం 6 గంటలకు పవన్ తన కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు బయలుదేరాడు. దాదాపు మూడు గంటలు దారిలోనే ఉన్నాడు.
...ఇదీ గ్రేటర్‌లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వివిధ వర్గాల ప్రజల దుస్థితి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాహన చోదకులు, ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం కారణంగా రాత్రి 10.30 గంటల వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఫ్లై ఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రహదారులపై మోకాలి లోతు వరదనీరు ప్రవహించింది. బహదూర్‌పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మలక్‌పేట్, ఎల్బీ నగర్, హయత్‌నగర్, మెహిదీపట్నం, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. పురాతన భవనాల సమీపంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది.
ఉద్యోగులకు నరక యాతన
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి విధులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరిన వారు భారీ వర్షంలో చిక్కుకుపోయారు. బస్సులు, ఆటోల రాకపోకలకు అంతరాయం కలగడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వాహన చోదకులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో రాత్రి ఎనిమిదింటి వరకు ట్రాఫిక్ ముందుకు కదలలేదు.
ఉప్పొంగిన నాలాలు
కుండపోతతో నాలాలు, డ్రైనేజి లైన్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో వరద నీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. లక్డీకాపూల్, చింతల్‌బస్తీ, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాలు దాదాపు నీట మునిగాయి. గ్రేటర్‌లో ప్రధాన రహదారులపై 120 లోత ట్టు ప్రాంతాల (వాటర్‌లాగింగ్ పాయింట్స్) వద్ద భారీగా వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది.
కదలని వాహనాలు..
రహదారులపై వరద పోటెత్తడంతో లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, సెక్రటేరియట్, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, సికిం ద్రాబాద్, మెహిదీపట్నం, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, మసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై రాత్రి 10 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రహదారులపై మోకాళ్లలోతున నీరు ప్రవహించడం తో బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు రాత్రి వరకు తీవ్ర అంతరాయం కలిగింది. జాంబాగ్, ఎర్రమంజిల్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, తార్నాకతో పా టు బేగంపేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోనూ ఫ్లైఓవర్ల మీద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
మునిగిన బస్తీలు..
భారీ వర్షానికి పలుచో ట్ల ఇళ్ల్లలోకి వాన నీరు చేరింది. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్, ఇందిరమ్మ నగర్, రసూల్పురా, అన్నానగర్, గాంధీనగర్‌లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెహిదీపట్నంలో గుడిమల్కాపూర్-మందుల బస్తీ, నదీం కాలనీ, అంజయ్య నగర్, బోజగుట్ట, తాళ్లగడ్డ, అంబర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్,చార్మినార్, బహదూర్‌పురా, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్‌లోని పలు బస్తీలు నీట మునిగాయి.
చీకట్లో కాలనీలు..
వర్ష బీభత్సంతో గ్రేటర్‌లో విద్యుత్ తీగలు తెగి పడి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చైతన్యపురి, సరూర్‌నగర్, బాలాపూర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, చార్మినార్, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్, మలక్‌పేట, హయత్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. అర్ధరాత్రి దాటాక కూడా కరెంట్ రాలేదు.