
అధిష్టానాన్ని ధిక్కరించడమే
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సోదరుడు రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి/భూదాన్‌పోచంపల్లి: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని నల్లగొండ ఎమ్మెల్సీ, సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి, భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడిలో వేర్వేరుగా విలేకరులతో ఆయన మాట్లాడారు. అధిష్టానం నియమించిన పీసీసీ అధ్యక్షుడిని విమర్శిస్తే, పరోక్షంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని విమర్శించినట్లే అవుతుందని చెప్పారు.
అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నియామకాలు, విధానాలపై ఏదైనా అసంతృప్తి ఉంటే.. నేరుగా అధిష్టానానికి చెప్పి ఉంటే బాగుండేదని హితవు పలికారు. కానీ. ఇలా బహిరంగంగా విమర్శించడం పార్టీకి నష్టమే తప్ప, లాభం ఉండదని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే 2019లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తారని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. అయితే, ఇలాంటి తరుణంలో క్రమశిక్షణరాహిత్య వ్యాఖ్యలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.