రాజస్తాన్‌లోని కోటా పట్టణం చీరలకే కాదు, కోచింగ్ సెంటర్లకీ ప్రతీతి. కోరుకున్న చోట సీటు రావాలని తల్లిదండ్రులు తమ పిల్లలను కోటాలో చేర్పిస్తారు. ప్రతిష్టాత్మక ఆల్‌ఇండియా మెడికల్ సైన్సెస్, ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. అయితే, ఈ కోచింగ్ సెంటర్లలో కేవలం 5 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో మరోమారు కోటా వార్తల్లోకెక్కింది. కోటాలోని ఓ కోచింగ్ సెంటర్లో ఐఐటీ శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి మంగళవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఐదు రోజుల్లో అక్కడ ఇది మూడో ఆత్మహత్య. డిసెంబర్ 24న మెడికల్ ఎంట్రన్స్ కోసం శిక్షణ తీసుకొంటోన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
డిసెంబర్ 22న రాజస్తాన్‌కి చెందిన 16 ఏళ్ల బూండీ తన గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోచింగ్ సెంటర్లలో విద్యార్థులపై మానసిక ఒత్తిడిని ఈ వరుస ఆత్మహత్యలు మరోసారి తెరపైకి తెచ్చాయి. జైపూర్‌కి 250 కి.మీ. దూరంలో ఉన్న కోటాలో 150 కోచింగ్ సెంటర్లలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌లో చేరిన ఈ విద్యార్థులకు ఐఐటీ, వైద్య విద్యల ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణనిస్తారు. వివిధ కారణాలతో 2011 నుంచి ఇప్పటి వరకు 60 మందికి పైగా విద్యార్థులు కోటా లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరోవైపు గత ఆరు నెలల్లో ఇక్కడి కోచింగ్ సెంటర్లలో 24 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతోమంది ప్రముఖులు తల్లిదండ్రులకు బహిరంగ లేఖలు రాసినా.. వ్యక్తిగతంగా అవి ఎవరినీ కదిలించట్లేద నేది నిజం. దీంతో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఆత్మహత్యలకు కారణాలు..
ఆల్‌ఇండియా మెడికల్ సైన్సెస్, లేదా ఐఐటీలో సీటు సంపాదించడమొక్కటే మార్గమని, అదే తమ భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్న తప్పుడు భావన ఇటు విద్యార్థుల్లోనూ, అటు తల్లిదండ్రు ల్లోనూ ఉంది. నిజానికి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే వేనవేల వేరే మార్గాలున్నాయన్న విషయం వారికి అర్థం కాకపోవడం వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి.
విద్యార్థుల విభజన..
ఫిల్టర్ చేసి మార్కులను బట్టి విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు ఏర్పర్చడం. ఎక్కువ మార్కులొచ్చే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, వారిని ప్రత్యేకంగా చూడటం. స్పెషల్ క్లాసెస్, అన్ని సదుపాయాలున్న గదులు కేటాయించడం, వ్యక్తిగత ఆసక్తి ప్రదర్శించడం, వారికి మాత్రమే 24 గంటలూ లెక్చరర్లు అందుబాటులో ఉంచడం లాంటివి విద్యార్థుల్లో చీలిక తెచ్చి, వారిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ ...
ఐఐటీ, లేదా ఎయిమ్స్‌కి వెళ్లే సామ ర్థ్యాలు ఆ విద్యార్థికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అంచనావేసే టెస్ట్ లేవీ లేకుండానే ఎంతమంది వస్తే, అంతమందిని కాలేజీల్లో చేర్చుకుంటున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య పోటీతత్వం గొర్రెల మందలా కోచింగ్ సెంటర్లలో విద్యార్థులను నింపుతోంది.
కోచింగ్ సెంటర్ల జిమ్మిక్కులు...
కోచింగ్ సెంటర్లు ప్రతిభ గల విద్యార్థులను వేరే ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి కొనుక్కొని తమ సెంటర్లలో చేర్చుకోవడంతో ఆయా సంస్థలకు తప్పనిసరిగా కొన్ని ఐఐటీ, ఎయిమ్స్ సీట్లొస్తాయి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదివినట్లు వారిపై ప్రకటనలిచ్చుకుని తల్లిదండ్రులను ఆకర్షించి ఎక్కువ మందిని చేర్చుకునే జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇందుకు స్మృతి ప్రత్యక్ష ఉదాహరణ. ఈఎన్‌టీ స్పెషలిస్ట్ కూతురు స్మృతిని అధికమొత్తంలో కొనేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment