గోదావరిఖని, న్యూస్‌లైన్ : రామగుండం ఎన్టీపీసీలో ఓ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు. అభివృద్ధి పనులకు బిల్లు పాస్ చేయాలని కోరగా ఇందుకు లంచం డిమాండ్ చేయడంతో విసిగి వేసారిన కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించాడు. గురువారం కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం తీసుకుంటున్న అధికారిని సీబీఐకి అధికారులు పట్టుకున్నారు. ఎన్టీపీసీ సివిల్ విభాగంలో ఎన్.మధుసూదన్ డెప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మేకల మల్లేశం అనే కాంట్రాక్టర్ ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ పథకానికి చెందిన రూ.28 లక్షల నిధులతో గోదావరినది వద్ద స్నానగట్టాలను రెండేళ్ల క్రితం నిర్మించాడు. స్నానగట్టాల నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని గతంలో మేనేజర్‌గా పనిచేసిన ఓ అధికారి తేల్చాడు. ప్రస్తుతం ఆయన బదిలీ అయి మరో మేనేజర్ రావడంతో తిరిగి బిల్లులు చెల్లించాలని మల్లేశం సివిల్ కార్యాలయం అధికారులను సంప్రదించాడు. ఈ బిల్లులు చెల్లించాలంటే లంచం ఇవ్వాలంటూ డెప్యూటీ మేనేజర్ మధుసూదన్ కాంట్రాక్టర్ మేకల మల్లేశంను డిమాండ్ చేశాడు.
తన వద్ద డబ్బులు లేవని, లంచం ఇచ్చుకోలేనని చెప్పడంతో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేశాడు. దీంతో కాంట్రాక్టర్ మల్లేశం హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం రాత్రి 7 గంటలకు కాంట్రాక్టర్ మల్లేశం సీబీఐ వారు ఇచ్చిన రూ.50 వేలను తీసుకెళ్లి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని సి-11/15 క్వార్టర్‌లో నివాసం ఉంటున్న మధుసూదన్‌కు ఇచ్చాడు. వెంటనే సీబీఐ అధికారి విజయభాస్కర్ నేతృత్వంలో అధికారులు దాడిచేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్‌కు చెందిన కారుతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అవసరమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీలో చర్చనీయాంశంగా మారింది.