
రామమందిర నిర్మాణమే లక్ష్యం
విరాట్ హిందూ సమ్మేళనం పేరుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం వీహెచ్‌పీ స్వర్ణోత్సవం కాదని, అయోధ్యలో రాముని మందిరం నిర్మించినప్పుడే...
సిద్దిపేట జోన్/ సిద్దిపేట రూరల్: విరాట్ హిందూ సమ్మేళనం పేరుతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం వీహెచ్‌పీ స్వర్ణోత్సవం కాదని, అయోధ్యలో రాముని మందిరం నిర్మించినప్పుడే వీహెచ్‌పీ అసలైన స్వర్ణోత్సవంలా పరిగణిద్దామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు డా. ప్రవీణ్‌బాయ్ తొగాడియా పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాల మైదానంలో వీహెచ్‌పీ స్వర్ణజయంతి ఉత్సవాల్లో భాగంగా విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్ బాయ్ తొగాడియా మాట్లాడుతూ, లాహోర్‌లోనూ రాముని సంబరం జరిగినప్పుడే వీహెచ్‌పీ మనస్ఫూర్తిగా ఉత్సవాలు చేసుకుంటుందన్నారు. ఆ దిశగా మూడు సంకల్పాలతో వీహెచ్‌పీ దేశ వ్యాప్తంగా స్వర్ణోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. వీహెచ్‌పీ లక్ష్యాలను లక్షలాది మంది ప్రజలకు తీసుకెళ్లే ఉద్దేశంతో భవిష్యత్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు.
వెయ్యి సంవత్సరాల క్రితం హస్తినాపురం, పాటలీపుత్రం లాంటి నగరాలు హిందువులకు నిలయంగా ఉండేవన్నారు. అలాంటి హిందూ సంస్కృకి దోపిడీకి గురైందన్నారు. గతంలోలాగా హిందుధర్మపై దాడి జరగకుండా ప్రతి హిందువూ కార్యసిద్ధితో ముందుకు సాగాలన్నారు. మత మార్పిడాలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ పోరాడుతుందన్నారు. ప్రస్తుతమున్న ముస్లింల పూర్వీకులు కూడా హిందూవులేనన్నారు.
హిందూవుల ప్రేమ ఎంతో గొప్పదని, శివపార్వతుల ప్రేమను ఉదహరిస్తూ హిందూ ప్రేమను ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. లవ్ జీహాద్‌ను హిందూవులమంతా వ్యతిరేకిస్తామన్నారు. ఒకే దేశంలో రెండు చట్టాలు కొనసాగడం అర్థరహితమన్నారు. సమృద్ధి, వ్యాపారం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆహారం, ఉద్యోగం నేడు హిందువుకు ఎంతో అవసరమన్నారు. దేశంలో ఒక్క హిందువు కూడా ఆకలితో మరణించరాదని, చదువు లేకుండా ఉండరాదని, నిరుద్యోగిగా మిగిలిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో 53 వేల గ్రామాల్లో 20 లక్షల మందికి చదువును చెప్పిస్తున్నామన్నారు. అదే విధంగా 50 వేల విద్యార్థులకు వసతి గృహాల ద్వారా చేయూతనందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో హిందూ విద్యార్థుల పరిరక్షణ కోసం ప్రణాళికను రూపొందించామన్నారు. అందులోభాగంగానే మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత హైదరాబాద్‌లోని వైద్యులతో ఇండియా హెల్త్ లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రవీణ్‌బాయ్ తొగాడియా స్పష్టం చేశారు.
18602333666 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను వీహెచ్‌పీ ద్వారా ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబాయి లాంటి మహానగరాల్లో వైద్యులతో సమావేశమై హెల్త్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి రోగిని పరామర్శించి ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో దీన్ని స్వీకరించామని, ఇందుకు ప్రతి వైద్యుడు సహకరించాలన్నారు.
\రాబోయే రోజుల్లో ప్రతి ఏటా కోటి మందికి ఉచితంగా వైద్యం అందించేందుకు వీహెచ్‌పీ ముందుకు సాగుతుందన్నారు. హిందువులకు సురక్ష, సన్మానం కోసం వీహెచ్‌పీ పని చేస్తుందన్నారు. అంటరాని తనాన్ని నిర్మూలించి దళిత వర్గాలను మిత్రులుగా భావించి ముందుకు సాగుతామన్నారు.
ఓట్లకోసమే ముస్లింలకు రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని డా. ప్రవీణ్‌బాయ్ తొగాడియా విమర్శించారు. ఆంధ్రాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ పేరిట హిందువుల అవకాశాలు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. అదే విధంగా తెలంగాణలో హిందువుల ఉద్యోగాలను లాక్కొని ముస్లింలకు ఇచ్చే కుట్ర జరుగుతోందన్నారు.
ఇరు ముఖ్యమంత్రులు జెరూసలేం, మక్కాలకు వెళ్లేందుకు సబ్సిడీలు ఇస్తున్నారని, అదే దళితుడు తిరుపతి వెళ్లడానికి ఎందుకు సబ్సిడీలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ముస్లిం విద్యార్థులకు రూ. 30 వేల పారితోషికం, పశ్చిమబెంగాల్ సీఎం మమతబెనర్జీ మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్నారని.. అదే తరహాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.
అనంతరం ప్రముఖ కవి కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, సచ్చిదానంద సమర్ధమహారాజ్, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ఆకుల రాజయ్య, శివానందస్వామి, తుమ్మల బాలు, గ్యాదరి పరమేశ్వర్ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు ప్రవీణ్ బాయ్ తొగాడియా హిందూ సంస్కృతిని కాపాడటంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రవీణ్ తొగాడియాను వీహెచ్‌పీ నాయకులు పూలమాలతో సన్మానించారు.
కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ స్వామిజీ, కృష్ణజ్యోతి స్వరూపనంద స్వామి, శివానందస్వామి, శాంతనందస్వామి, మాతా నిర్మలానంద యోగ భారతి, అష్టకాల నరసింహరామశర్మ, గాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రాంచందర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, భానుచందర్, ధనుంజయ్, గుమ్మల్ల సత్యంజీ, వనపర్తి వెంకటేశం, కేశవరావు, రఘునందన్‌రావు పాల్గొన్నారు.