సాక్షి, సిద్దిపేట : చిన్ననాటి నుంచి తన మిత్రులతో కలిసి సరదాగా చేసిన మిమిక్రీ నేడు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు అయ్యేలా తీర్చిదిద్దింది. ప్రపంచం శాస్త్ర సాంకేతికతలో అభివృద్ధి చెందుతున్నా మాయలు, మంత్రాలు అనే నెపంతో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే సమాజంలో ఇలాంటి మూఢ నమ్మకాలు పోగొట్టే ఉద్దేశంతో సిద్దిపేట పట్టణానికి చెందిన రమేశ్ తన వంతుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
భయంతో వినని చిన్నారులు కేవలం కథలు, పుస్తకాలు, కావ్యాలు, పాటలు, తదితర కళాత్మకమైన అంశాలను కలిపి చెబితే త్వరగా అర్థం చేసుకుంటారు. సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు రమేశ్ తనదైన శైలిలో రాణిస్తూ పలువురిని ఆకర్షిస్తున్నాడు. వేదిక ఏదైనా ప్రజలకు వెళ్లాల్సిన విషయం మాత్రం సూటిగా చెబుతున్నాడు. దీనిలో ఆరితేరిన రమేశ్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా పేరుగాంచారు. ప్రభుత్వ పథకాలు అయితేనేం, సామాజిక అంశాలు అయితేనేం, చెప్పాల్సిన విషయం మాత్రం చక్కగా అర్థమయ్యేలా తన కళలతో వివరిస్తూ రాణిస్తున్నాడు.
అంతా సైన్స్ మాయనే..
మాయలు, మంత్రాలు లేవు, కేవలం ట్రిక్స్, హస్తలాఘవం, ఉపయోగిస్తూ చేసేవే అని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. కేవలం ఇవే కాకుండా రమేశ్ గొంతు సవరించి మాట్లాడుతే నవ్వులే నవ్వులు, చేతులు కదిలిస్తూ మాయజాలం చేస్తు మైమరిపించే మాయలను చూపిస్తాడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం తదితర కళలను చిన్నతనం నుంచే అలవాటుగా మార్చుకుని మిమిక్రీ , మెజీషియన్‌గా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చి నేటికి అనేక రికార్డులు నెలకొల్పొతున్నాడు.
సిద్దిపేట స్వచ్ఛ మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. మాయలు, మంత్రాలు లేవు కేవలం సైన్స్ అనే నినాదంతో రమేష్ తన మిమిక్రీ, వెంట్రిలాక్విజం చేస్తు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. నెత్తి మీద మంట పెట్టి టీ చేయడం, కత్తిని నోట్లోకి పూర్తిగా పెట్టుకోవడం, చెవు, ముక్కు, నోటిలో నుంచి నీరు తీయడం, నోట్లో నుంచి వరుసగా బ్లెడ్లు తీయడం, నిమ్మకాయ నుంచి రక్తం కారించడం చేతిలో ఏమి లేకుండా గాలిలో నుండి 50 రూపాయల నోటును తీయడం లాంటి వాటితో ప్రజల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాల నిర్మూలన పట్ల అవగాహన కల్పిస్తున్నాడు.
వెంట్రిలాక్విజంలోనూ..
నోరు కదపకుండా మాట్లాడటమే వెంట్రిలాక్విజం. పెదాలను కదిలించకుండానే శబ్ధం, ధ్వని వస్తున్నట్లు వినిపిస్తు చూపరులను ఆకర్షిస్తారు. ముఖ్యంగా టాకింగ్ డాల్ చేతిలో పట్టుకొని, పెదాలు కదపకుండా కొంతమంది శబ్ధాలు చేస్తు ప్రేక్షకులను ఆకర్షిస్తుంటారు. రమేష్ ఈ ప్రదర్శనలతో నవ్వించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా పక్షులు, జంతువుల శబ్ధాలను అనుకరిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు.
నేరుగా, సామాజిక మాధ్యమాల ద్వారా..
తన కళలను నేరుగా లేదంటే సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు రమేశ్. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, టిక్‌టాక్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ టీవీ చానల్‌ల ద్వారా తన మిమిక్రీ కళను ప్రదర్శిస్తున్నాడు.
జాతీయ స్థాయి అవార్డుల వరకు..
ఎన్నో రకాల ప్రదర్శనలతో అవార్డులతో పాటుగా, రివార్డులు కూడా పొందాడు. తెలుగు బుక్ అఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులలో చోటు సంపాదించాడు. 2013, 2016 సంవత్సరాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా సన్మానం అందుకున్నాడు. 2015 నుంచి సిద్దిపేట మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. అదే విధంగా అప్పటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా సన్మానం పొందాడు.
సినీ నటులు ఆర్. నారాయణమూర్తి, సంపూర్ణేష్‌బాబుల చేతుల మీదుగా సన్మానాలు పొందాడు. 2019లో రాష్ట్ర స్థాయి మిమిక్రీ వర్క్‌షాప్‌లో అంజన్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రత్యేక అవార్డు అందుకున్నారు. జట్‌లీ బుక్ ఆఫ్ రికార్డ్స్ (తమిళనాడు) అదే విధంగా త్వరలో నేషనల్ కల్చరల్ అకాడమీ ఢిల్లీ వారి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకోనున్నారు.
ఇప్పటి వరకు 2 వేల ప్రదర్శనలు..
కార్యక్రమం ఏదైనా అక్కడ తన మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో ప్రజలను ఉత్సాహాపర్చడమే రమేశ్ కర్తవ్యంగా మారింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల వార్షికోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం నుంచి మొదలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయే స్టేజీ షోలను ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సాక్షి టీవీ, జీటీవీ, ఎన్‌టీవీ, దూరదర్శన్ తదితర చానల్‌లలో దారవాహిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
ఇప్పటి వరకు 2 వేల వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. అనేక మంది ప్రముఖుల చేతుల మీదుగా సత్కారాలు అందుకొని షభాష్ అనిపించుకుంటున్నాడు. సెలవు దినాల్లో మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌ల ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాడు. రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment