మొరం... అక్రమార్కుల పరం | Random illegal mining | Sakshi

మొరం... అక్రమార్కుల పరం

Published Mon, Jul 6 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

మొరం... అక్రమార్కుల పరం

మొరం... అక్రమార్కుల పరం

మండలంలోని అనంతపురం గుట్టల్లో, జమ్ములమ్మ రిజర్వాయర్ దగ్గర, కొండపల్లి, ముల్కలపల్లి పరిసర ప్రాంతాల్లో, సంగాల చెరువుశిఖం భూమిలో యంత్రాలతో అక్రమార్కులు మొరం తవ్వుతున్నారు...

నియోజకవర్గంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన సహజ వనరులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపట్టిన అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు.. అధికారులు తనిఖీకి వస్తే మామూళ్లతో సరిపెడుతున్నారు.. వారి ఉదాసీనత వల్ల కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి.. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతోంది..   
- యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
- ఏటా *2 కోట్ల వ్యాపారం
- చోద్యం చూస్తున్న అధికారులు

మండలంలోని అనంతపురం గుట్టల్లో, జమ్ములమ్మ రిజర్వాయర్ దగ్గర, కొండపల్లి, ముల్కలపల్లి పరిసర ప్రాంతాల్లో, సంగాల చెరువుశిఖం భూమిలో యంత్రాలతో అక్రమార్కులు మొరం తవ్వుతున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా యథే చ్ఛగా ఇతర ప్రాంతాలకు మొరంమట్టి తరలిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ శివారులోని పారిశ్రామికవాడకు కేటాయించిన స్థలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. అలాంటిది అక్రమార్కులు సమతుల్యంగా ఉన్న భూమిని సైతం సుమారు పది అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు.

ఇలా  మూడు ప్రాంతాల్లో అక్రమంగా తవ్వి యథేచ్ఛగా మొరంమట్టిని తరలిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ధరూర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే, నెట్టెంపాడు పనుల కోసం గతంలో మట్టి తవ్వకాలు జరపడానికి అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన విషయం విదితమే. అనుమతులు ఇచ్చిన క్వారీల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వర్షాకాలంలో మొరం కోసం తవ్విన గోతులు నీటితో నిండిపోతున్నాయి. గట్టు మండలంలోని ఆలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను అక్రమంగా కొల్లగొట్టి మొరం తరలించారు. మల్థకల్ మండలంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
 
లక్షల్లో వ్యాపారం...
అక్రమార్కులు నిత్యం లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. గద్వాలలో కొనసాగుతున్న అక్రమ క్వారీల నుంచి ప్రతిరోజూ వందకుపైగా ట్రాక్టర్ ట్రిప్పుల మొరం తరలివెళుతోంది. మొరం రకాన్ని బట్టి ట్రిప్పు *400 నుంచి *600 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన నెలకు *15 లక్షల మొరం దందా అక్రమంగా కొనసాగుతోంది. అంటే ఏడాదికి *రెండు కోట్ల వరకు అక్రమార్కులు దండుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే కోట్ల రూపాయల పనులకు క్వారీ అనుమతులు తీసుకుంటున్నారు. మిగిలినచోట్ల మోటా కాంట్రాక్టర్లు, మండల, గ్రామస్థాయి నాయకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దీనిని రోడ్లు, భవన నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న అక్రమార్కులకు కొందరు అధికారులు వంతపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇకనైనా ఈ వ్యవహారంపై జిల్లా పాలనా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement