ఇసుక చుట్టూ తమ్ముళ్లు
బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. తెలుగు తమ్ముళ్లు ఇసుక చుట్టూ ముసురుతున్నారు. అడ్డదారుల్లో తరలించుకుపోతున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. నిబంధనలను లెక్కచేయకుండా సరిహద్దులనూ దాటించేస్తున్నారు. నదుల్లోని ఇసుకను సముద్ర ఇసుకతో కల్తీ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు వనజాక్షిపై దాడి వ్యవహారంలో తమ అధినేత వైఖరి తేటతెల్లం కావడంతో ‘తమ్ముళ్లు’ తెగ రెచ్చిపోతున్నారు. కొన్నిచోట్ల రెవిన్యూ అధికారులకు, పోలీసులకు మామూళ్లు చెల్లిస్తూ తమ జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
- అక్రమ తవ్వకాలు.. అడ్డొస్తే అఘాయిత్యాలు
- సముద్ర ఇసుకతో భారీ కల్తీ
- భారీగా మామూళ్లు.. పార్టీలు
- చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారులు
జిల్లాలోని పద్మనాభం మండలం పాండ్రంగిలో అధికారులకు ఇసుక తరలింపు సమాచారం ఇస్తున్నాడన్న కక్షతో సారిక కన్నయ్య హత్య, విశాఖ జిల్లా సరిహద్దులోని పాయకరావుపేట తాండవ నదిలో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న తుని ఎమ్మెల్యే రాజా, అతని గన్‌మెన్‌పై టీడీపీ నేతల దాడి ఘటనలతో ఇసుకాసురుల ఆగడాలు చర్చనీయాంశమవుతున్నాయి. గోస్తనీ నది ఇసుక అక్రమార్కులకు వరం గా మారింది. ఈ నదికి ఉప్పునీటి తాకిడి ఉన్నందున ఇసుక కట్టడాలకు పనికిరాదని ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అప్పగించలేదు.
కానీ ఇసుక అక్రమార్కులకు, ప్రభుత్వ కట్టడాలకూ మాత్రం ఇదే పనికొస్తోంది. గోస్తనీ నది పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాల్లో సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పరివాహక ప్రాంతాలైన అనందపురం మండలం బోని, పద్మనాభం మండలం పద్మనాభం, మద్ది, పొట్నూరు, పాండ్రంగి, మునివానిపాలెం, సామియ్యవలస, భీమి లి మండలం మజ్జివలస, తాటితూరు, టి.నగరంపాలెం, తగరపువలస, మూలకుద్దు, టి.నాగమయ్యపాలేల్లో సింహభాగం తెలుగు దేశం వారి కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని చెబుతున్నారు.
ఏం చేస్తున్నారు?: భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో 500 ఎకరాల్లో 60-70 మీటర్ల ఎత్తున వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ సహజ సముద్ర ఇసుక దిబ్బలున్నాయి. అక్కడ ఇసుకను లారీలు/ట్రాక్టర్లలో గోస్తనీ తీరానికి తరలించి అక్కడ నది ఇసుక పోగుల పక్కన వేస్తారు. రోజుకు పద్మనాభం, భీమిలి మండలాల్లో వందకు పైగా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకు వెళ్తూనే ఉంటుంది. ఇలా 50 ఎకరాల్లో ఇసుకను మాయం చేసేశారు. శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చే నాణ్యమైన ఇసుక 8 యూనిట్లకు రూ.45 వేల ధర పలుకుతోంది.
అదే గోస్తనీలో కల్తీ ఇసుక రూ.20-25 వేలకే లభిస్తోంది. ట్రాక్టరు (ఒకటిన్నర యూనిట్లు)కు రూ.3-5 వేలకే ఇస్తున్నారు. శ్రీకాకుళం ఇసుకతో పోలిస్తే చౌకగా దొరకడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ప్రభుత్వ భవనాలకు దీనినే వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్నాళ్ల క్రితం వంద లారీల్లో సముద్ర ఇసుక తరలిస్తూ పట్టుబడగా కేవలం ఏడు లారీలపైనే కేసులు పెట్టారు. ఇసుక అక్రమ రవాణాదార్ల నుంచి రూ.10 లక్షలు జరిమానా వసూలు చేశామని, గట్టి నిఘా పెట్టామని, కొందరిపై బౌండోవర్ కేసులు పె ట్టామని భీమిలి రెవిన్యూ అధికారులు చెబుతున్నారు.
ఇదీ సంగతి:ఇసుక అక్రమ రవాణా కాకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారులది, ఆయా గ్రామాల వీఆర్వోలది. కానీ నిత్యం యధేచ్ఛగా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకు తరలిపోతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల అటు ఇసుక అక్రమ రవాణాదార్లకే కాకుండా రెవిన్యూ అధికారులకూ పంట పండుతోంది. పద్మనాభం మండలంలోని ఓ వీఆర్వో ఏడాది కాలంలో ఏకంగా ఎనిమిది కార్లను కొనుగోలు చేయడం, మరికొందరు రిటైర్డు ఉద్యోగులు ఇసుక తరలింపునకు ఎడ్లబళ్లను కొనడం చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇసుక అక్రమ తరలింపుదార్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మామూళ్లతో పాటు ప్రతి ఆదివారం పార్టీలు ఇస్తారన్న ప్రచారం ఉంది.
పాయకరావుపేట మండలం తాండవ నదిలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. తగినంత ఇసుక లభ్యత లేదంటూ అక్కడ రీచ్‌లను డ్వాక్రా మహిళలకు కేటాయించలేదు. కానీ పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు నిర్భీతిగా ఇసుక తవ్వించి సరిహద్దులు దాటించేస్తున్నారు. చౌకగా ట్రాక్టర్ ఇసుక రూ.800లకే విక్రయిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే ఇదిగో ఇలా సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే దాడులకు తెగబడుతున్నారు.