రాబడిలో నెం.1 | rangareddy number one in revenue source of income | Sakshi
Sakshi News home page

రాబడిలో నెం.1

Published Tue, Jul 8 2014 11:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

rangareddy number one in revenue source of income

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి ఆయువుపట్టు రంగారెడ్డి జిల్లా. రెవెన్యూ పరంగా రాష్ట్ర ఖజానాకు జిల్లా ప్రధాన ఆదాయవనరుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రణాళిక శాఖ పది జిల్లాల వివరాలతో ప్రణాళిక సూచికలు విడుదల చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరం చివరితో ఈ గణాంకాలున్నాయి. వరుసగా పదేళ్ల వృద్ధిని పోల్చుతూ రూపొందించిన ఈ వివరాల్లో రంగారెడ్డి జిల్లా పలు అంశాల్లో ముందు వరుసలో నిలిచింది. ఆ వివరాల్లో ప్రధాన అంశాలను  పరిశీలిస్తే.

 అపార ఖనిజ సంపదలున్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లా నుంచి కోట్ల రూపాయల ఆదాయం ఏటా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. 2012-13 సంవత్సరంలో జిల్లాలో ఏకంగా రూ.5,210.42 కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు వెలికితీశారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. ఇందులో రూ.34కోట్ల విలువైన ఫెల్‌స్పార్, రూ.65 కోట్ల విలువైన లాటరైట్, రూ.611 కోట్ల విలువైన లైమ్‌స్టోన్ రూ. 28 కోట్ల విలువైన క్వార్ట్జ్‌రాయి... రూ. 3,217కోట్ల విలువైన గ్రానైట్, రూ.312.64కోట్ల విలువైన కంకర, రూ.942.78 కోట్ల విలువైన పెద్దసైజు కంకర విక్రయాలు జరిగాయి.

 రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 23,352 పరిశ్రమలున్నాయి. వీటిలో 500 భారీ పరిశ్రమలే. దీంతో అత్యధికంగా విద్యుత్ వినియోగిస్తూన్న జిల్లాలో రెండోస్థానంలో ఉన్నాం.

 వాహనాల సంఖ్యలోనూ జిల్లా తొలి మూడుస్థానాల్లో ఉంది. జిల్లాలో త్రీవీలర్, ఫోర్ వీలర్ ఆపై కేటగిరీలకు సంబంధించి 1,54,446 వాహనాలున్నాయి. ఇవి కాకుండా 15.16 లక్షల మోటర్ సైకిళ్లున్నాయి.

 ఆర్థిక అంశాల పరంగా జిల్లా లో భారీలావాదేవీలు జరుగుతున్నాయి. జిల్లాలో 1314 బ్యాంకులున్నాయి. ఇందులో స్టేట్‌బ్యాంకు గ్రూపునకు సంబంధించినవి 190, జాతీయ బ్యాంకులు 282, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 51, ప్రైవేటు బ్యాంకులు 134, ఇతర షెడ్యూల్డ్ బ్యాంకులు 657 ఉన్నాయి. వీటి పరిధిలో రూ. 1523.39 కోట్ల పంటరుణాలు, రూ. 3143.37కోట్ల పరిశ్రమల రుణాలు, రూ. 134.52 కోట్ల వాహన రుణాలు, రూ.561.2 కోట్ల ఉపాధి రుణాలు, రూ.3,489.44 కోట్ల వ్యక్తిగత రుణాలిచ్చారు.

 తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంటనూనె సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతుండడం గమనార్హం.

 2012-13 ఆర్థిక సంవత్సరం చివరినాటికి జిల్లా కోర్టుల పరిధిలో 23,660 అపరిష్కృత కేసులున్నట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య అధికం.

 హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, మహానగరంలో అంతర్భాగం కావడంతో అటు టూరిజం పరంగా జిల్లా రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు వెళ్లాలంటే జిల్లాలో ఎంట్రీ తప్పనిసరి. అంతేకాకుండా హైటెక్‌సిటీ, చిలుకూరు బాలాజీ, అనంతగిరి, శిల్పారామం తదితర టూరిజం స్పాట్లు జిల్లాలో ఉండడంతో పర్యటకుల తాకిడి అధికంగానే ఉంది. 2012-13సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ, జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని కలుపుకుంటే 97.77లక్షల భారతీయులు, 2.23లక్షల విదేశీ పర్యాటకులు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే విదేశీ పర్యటకుల తాడికి కొంత తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement