భార్యా పిల్లలతో నాగ శ్రీకాంత్
‘అందరి దృష్టిలో ఈ నవంబర్ 14 బాలల దినోత్సవం. కానీ నాకు మాత్రం పునర్జన్మను పొందిన రోజు. ఆస్పత్రికి, వైద్య సిబ్బందికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది’ – నాగ శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: గుండె పూర్తిగా దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. గుండెమార్పిడి చికిత్సతో మళ్లీ జీవితాన్ని ప్రసాదించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌రావు, గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు, కార్డియాలజిస్ట్ పవన్ పోద్దర్ శుక్రవారం ఆస్పత్రిలో మీడియాకు ఈ చికిత్స వివరాలు వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యశ్రీ పథకం కింద బాధితునికి ఈ చికిత్సను ఉచితంగా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ శ్రీకాంత్(48) ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంటున్నారు. కొంత కాలంగా ఛాతీలో తీవ్ర అసౌకర్యం, గుండె దడ సమస్యలతో బాధపడుతున్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు.
రక్త ప్రసరణలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినా ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. దీంతో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావును ఆశ్రయించారు. పలు వైద్య పరీక్షలు చేసిన తరువాత గుండె ఎడమ జఠరిక సిస్టోలిక్ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించి, గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని సూచించారు. చికిత్సకు అంగీకరించడంతో గుండె దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆర్థిక సహకారం కోసం ఆరోగ్యశ్రీలో దరఖాస్తు చేశారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నవంబర్ 13న ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయాలు తగలడం, అప్పటికే అపస్మారకస్థితిలోకి చేరుకోవడం తో వైద్యులు బ్రెయిన్‌డెడ్ డిక్లేర్ చేశారు. అవయ వాలను దానం చేసేందుకు యువకుని తరఫు బంధువులు అంగీకరించడంతో వెంటనే జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని చికిత్స కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్‌తో పాటు ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందజేశారు.
రెండు బృందాలుగా ఏర్పడి..
విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెండు బృందాలుగా విడిపోయారు. దాత నుంచి గుండెను సేకరించేందుకు ఓ బృందం సిద్ధం కాగా, గుండెను తరలించే లోపు స్వీకర్త ఛాతీ తెరచి ఉంచేందుకు మరో బృందం సిద్ధమైంది. నవంబర్ 13న రాత్రి ప్రత్యేక గ్రీన్‌చానల్ ద్వారా ఏడు నిమిషాల్లో సోమాజిగూడ నుంచి మలక్‌పేట ఆస్పత్రికి గుండెను తరలించారు. రాత్రి 3.30 గంటలకు గుండె మార్పిడి చికిత్స ప్రారంభమైంది. సర్జరీ సమయంలో తలెత్తిన అధిక రక్తస్రావం సమస్యను నిరోధించడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. నవంబర్ 14 ఉదయం 9.30 గంటలకు సర్జరీ ముగిసింది. 24 గంటల పాటు వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ తర్వాత వెంటిలేటర్ తొలగించి... రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉంచారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ జీఎస్‌రావు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment