పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచిన చెక్కుల బాక్సులు
సాక్షి, కామారెడ్డి: పంట పెట్టుబడి సాయంగా రైతులకు అందించేందుకు తయారు చేసిన చెక్కులు జిల్లాకు చేరాయి. వాటిని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయం అందించడానికి జిల్లాలో తొలివిడతలో 156 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోని 80,051 మంది రైతులకు అందించడానికి రూ. 62.85 కోట్లకు సంబంధించి 80,383 చెక్కులు తయారు చేశారు. ఈ చెక్కులు జిల్లాకు చేరాయి. వీటిని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఠాణాల్లో భద్రపరిచారు.
సర్కారు ఆదేశాలే ఆలస్యం....
మొదటి విడత ఎంపిక చేసిన 156 రెవెన్యూ గ్రామాల్లో చెక్కుల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొదట నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20 నుంచి చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం చెక్కుల పంపిణీని వాయిదా వేసింది. తేదీ ఖరారు చేయకపోవడంతో చెక్కులను భద్రంగా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏ ఇబ్బంది తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
రెండో విడత చెక్కుల పంపిణీకి కూడా కసరత్తు జరుగుతోంది. జిల్లా యంత్రాంగం రికార్డుల ప్రక్షాళనలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రిను వేగం పెంచింది. మరో వందకుపైగా గ్రామాలకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తికానుంది. వీటికి చెక్కులు కూడా సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. మొదటి విడత పంపిణీ పూర్తవకముందే రెండో విడతకు సంబంధించిన చెక్కులు జిల్లాకు చేరుతాయని భావిస్తున్నారు.
మంత్రికి ప్రతిష్టాత్మకం
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ. 4 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు చెక్కులను అందించే అవకాశం వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డికి దక్కింది. దీనిని ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తన సొంత జిల్లాలో పంపిణీ ప్రక్రియ వేగంగా జరగాలని ఆయన ఆరాటపడుతున్నారు. చెక్కుల పంపిణీ నమూనా(మాక్) కార్యక్రమాన్ని ఇటీవలే జిల్లాలోని భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎలా అధిగమించాలి, సమస్యలు తలెత్తకుండా ఎలా వ్యవహరించాలన్న విషయాలపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలన్న దానిపై ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమాన్ని ఎలా సక్సస్ చేయాలన్న దానిపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు.
పోలీస్‌స్టేషన్‌లలోభద్రపరిచాం..
రైతు బంధు పథకం కింద పంపిణీ చేయడానికి ప్రభుత్వం చెక్కులను పంపించింది. వాటిని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రైతులకు అందిస్తాం. – నాగేంద్రయ్య,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment