హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది.
ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్‌ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది.
లక్షల్లో రైతుబంధు సొమ్ము
తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది.
అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment