సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వీటి పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో మొత్తం 8,76,078 ఓట్లు పోలవగా... సికింద్రాబాద్‌లో 9,10,437 ఓట్లు, ఈ రెండింటి పరిధిలో 382 సర్వీసు ఓట్లు పోలయ్యాయి. ఇక హైదరాబాద్ సెగ్మెంట్‌లో 2,696 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, సికింద్రాబాద్‌లో 3,900 పోలయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేపడతారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్‌రామ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో, హైదరాబాద్ స్థానానికి నిజాం కళాశాలలో లెక్కించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తమ్మీద 270 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 270 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌లు, 250 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించనున్నారు. వీరందరికీ ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయింది. ఈ నెల 22న సెగ్మెంట్‌ల వారీగా మరోసారి శిక్షణనివ్వనున్నారు. కేంద్ర ఎన్నికల పర్యవేక్షకుల సమక్షంలో ఈ నెల 22, 23 తేదీల్లో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించనున్నారు.
8గంటలకు ప్రారంభం..
ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. మొదట కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి ఐదు వీవీప్యాట్‌లలోని ఓటరు స్లిప్‌లను కౌంటింగ్ హాల్ వద్ద ఏర్పాటు చేసే సెపరేట్ హాల్‌లో లెక్కించనున్నారు. కౌంటింగ్ తేదీ, సమయం, కేంద్రాల సమాచారాన్ని పోటీలో నిలిచిన అభ్యర్థులకు ముందుగానే అందిస్తారు. కౌంటింగ్ జరిగే 23న స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచే సమాచారాన్ని కూడా అభ్యర్థులకు అందిస్తారు. ఈవీఎంల కౌంటింగ్ అనంతరం వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దనున్న ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు నెగోషియబుల్ ఇనిస్ట్‌మెంట్ చట్టం కింద లోకల్ హాలీ డేగా ప్రకటించారు.
లెక్కింపు కేంద్రాల పరిశీలన..
ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లు సోమవారం పరిశీలించారు. అడిషనల్ సీపీ దేవేందర్‌సింగ్ చౌహాన్, సహాయ రిటర్నింగ్ అధికా>రులతో కలిసి నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన ముషీరాబాద్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఓట్ల లెక్కింపు కేంద్రం ఎల్బీ స్టేడియం, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు జరిగే నిజాం కళాశాల కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అభ్యర్థుల ఏజెంట్లు విధిగా పోలీస్ వెరిఫికేషన్ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి ఓట్ల లెక్కింపులో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను లెక్కిస్తున్నందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు మంచినీరు, ఇతర ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపుకుగాను ప్రతి సెగ్మెంట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ఈ నెల 16న ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి తొలి విడత శిక్షణ ముగిసిందని, 22న ముఫకంజా కాలేజీలో రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 23న అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరవడం జరుగుతుందని, 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లను చేపట్టామన్నారు.
కౌంటింగ్ కేంద్రాలు ఇవీ...
సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో...
అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ సెంటర్
ముషీరాబాద్ ఎల్బీ స్టేడియం
నాంపల్లి ఎల్బీ స్టేడియం
సికింద్రాబాద్ ఉస్మానియా దూరవిద్య కేంద్రం
సనత్‌నగర్ ఓయూ ఎంబీఏ కళాశాల
అంబర్‌పేట్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్
జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం
ఖైరతాబాద్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం
హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో...
అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ సెంటర్
మలక్‌పేట్ అంబర్‌పేట్ మున్సిపల్ స్టేడియం
గోషామహల్ కోఠి ఉమెన్స్ కాలేజీ
బహదూర్‌పురా మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల
కార్వాన్ మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల
చార్మినార్ కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల
చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల లైబ్రరీ హాల్
యాకుత్‌పురా వనిత మహిళా కళాశాల
Comments
Please login to add a commentAdd a comment