చేవెళ్ల లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | Ready For Counting in Chevella | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు రెడీ

Published Wed, May 22 2019 8:22 AM | Last Updated on Wed, May 22 2019 8:22 AM

Ready For Counting in Chevella - Sakshi

కౌంటింగ్‌ కేం్రద్రంలో కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉత్కంఠ రేపుతున్న చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు  యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కౌంటింగ్‌కు ఒక్క రోజే గడువు ఉండటంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు భద్రత పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,785 పోలింగ్‌ కేంద్రాల్లో గతనెల 11న జరిగిన పోలింగ్‌లో 12.99 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను శంషాబాద్‌ మండలం పాల్మాకులలోని బీసీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థ భవనానికి తరలించారు. దాదాపు 43 రోజుల పాటు ఈవీఎంలను అక్కడే భద్రపరిచారు.  ఓట్ల లెక్కింపు అక్కడే జరగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో సుమారు 1,700 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

లెక్కింపు ఇలా..
ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్‌ సూపర్‌వైజర్, కౌంటింగ్‌ అసిస్టెంట్‌తోపాటు మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు కేటాయించిన ఒక టేబుల్‌ని కలుపుకుంటే మొత్తం 15 టేబుళ్లు నియోజకవర్గానికి ఉంటాయి. మొత్తం 1,700 మంది కౌంటింగ్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్‌ అధికారితోపాటు ఇద్దరు పరిశీలకులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి సెగ్మెంట్‌లో 43 రౌండ్లు, అత్యల్పంగా తాండూరు  నియోజకవర్గంలో 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. లోక్‌సభ బరిలో 23 మంది అభ్యర్థులు నిలవగా.. ప్రతి అభ్యర్థి ఒక్కో టేబుల్‌కు ఒకరి చొప్పున ఏజెంటుని నియమించుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం 368 మంది ఏజెంట్లు ఉంటారు. 

ఈవీఎంలు మొరాయిస్తే ఎలా?
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈవీఎంలు మొరాయించినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ప్రత్యామ్నాయ మార్గాలను పాటించనున్నారు. సదరు ఈవీఎంకు చెందిన వీవీ ప్యాట్‌లోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తారు. ఈ స్లిప్పులనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టినా ఇదే పద్ధతిని అనుసరించక తప్పదని అధి కారులు పేర్కొంటున్నారు. అయితే విధానాన్ని అనుసరించడానికి ముందుకు కేంద్ర ఎన్నికల సం ఘం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఐదు వీవీ ప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు
కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల పనితీరులో పారదర్శకతను చాటేలా కొన్ని వీవీ ప్యాట్‌లలోని ఓటరు స్లిప్పులను రాండమ్‌గా లెక్కిస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున ఈవీఎంను లాటరీ ద్వారా తీస్తారు. ఈ వీవీ ప్యాట్‌లలోని ఓట రు స్లిప్పులను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈ స్లిప్పుల ఆధారంగా అభ్యర్థుల వారీగా దక్కిన ఓట్లను.. ఈవీఎంలో అభ్యర్థుల ఓట్లను సరిపోల్చుతారు. 

మూడంచెల భద్రత
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్‌ కేంద్ర వద్ద మూడంచెల విధానంలో పోలీసులను మోహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలను ఇందుకు వినియోగించుకుంటున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులు పహారా కాస్తున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్, జిల్లావ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉంటుంది. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదు. పోలింగ్‌ కేంద్రంలోకి పాస్‌లు ఉన్న వ్యక్తులను అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు తీసుకెళ్లడం నిషేధం. 

సిబ్బంది నియామకంలో జాగ్రత్తలు
ఓట్ల లెక్కింపునకు విధుల్లో పాల్గొనే సిబ్బంది నియామకంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని సిబ్బంది అదే నియోజకవర్గంలో విధులు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి ఏ సెగ్మెంట్‌ పరిధిలో ఏ టేబుల్‌పై విధులు కేటాయిస్తారో అనేది అప్పుడే వెల్లడించకుండా పారదర్శకతను పాటిస్తున్నారు. లెక్కింపు రోజున సిబ్బందికి విధులు ఎక్కడో చెప్పనున్నారు. ఒకవేళ విధులు కేటాయించిన ఉద్యోగులకు రాకపోతే మరికొంతమందిని రిజర్వులో ఉంచుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఫలితాన్ని ఇలా తెలుసుకోవచ్చు..
రౌండ్స్‌ వారీగా ఫలితాలు అందరికీ తెలిసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలను సువిధ, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌లలో అప్‌లోడ్‌ చేయనుంది. ఒక్కో రౌండ్‌ పూర్తికాగానే.. వెంటనే యాప్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

బరిలో ఉన్న అభ్యర్థులు:  23  
మొత్తం ఈవీఎంలు:  2,785
లెక్కించాల్సిన ఓట్లు: 12,99,956
లెక్కింపు సిబ్బంది: 1,700
బందోబస్తులో పోలీసులు: 1,000
అభ్యర్థుల ఏజెంట్లు: 368

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement