మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యను సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే విద్యార్థికి, సమాజానికి న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అన్నారు. ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాల 50 వార్షికోత్సవాన్ని మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రతి విద్యార్థి విద్య ప్రాధాన్యతను గుర్తించి క్రమశిక్షణతో చదువాలన్నారు. ఎంతో మంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని అన్నారు. ప్రభుత్వ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, కళాశాలలో 3వేల మంది విద్యార్థులుండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. కళాశాల వ్యవస్థాపనకు కృషి చేసిన పల్లెర్ల హనుమంతరావు వంటి మహానీయుని విద్యార్థులు గుర్తించుకోవాలన్నారు.
ప్రైవేట్ కళాశాలల పోటీని తట్టుకొని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపడం అభినందనీయమని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయడానికి, విద్యారంగ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం మాట్లాడుతూ 50ఏళ్లుగా ఎంవీఎస్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు. విద్యార్థులు గొప్ప ఆలోచనలు చేయాలని, అనుకున్నది సాధించాలని అన్నారు. బాలికా విద్య చాలా ముఖ్యమని, ఒక మహిళా చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు.
పీయూ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని అన్నారు. అంతకు ముందు ప్రిన్సిపల్ డాక్టర్ యాదగిరి కళాశాల నివేధికను, పురోగతిని వివరించారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, పీయూ రిజిస్ట్రార్ వెంకటాచలం మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు అత్యున్నత స్థానంలో ఉన్నారని అన్నారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూదన్‌రెడ్డి, పీయూ పాలకమండలి సభ్యుడు శ్రీనివాసరావు, సీపీడీసీ సభ్యులు వినాయకరావు, క్రిష్ణారెడ్డి, డాక్టర్ సీహెచ్.చంద్రయ్య, విశ్వనాథం మాట్లాడుతూ ఎంవీఎస్ కళాశాల గురించి అనుభవాలను వివరించారు. అనంతరం కళాశాల సావనీర్‌ను విడుదల చేశారు. అదే విధంగా కళాశాల విద్యార్థి లక్ష్మినర్సింహ రాసిన కుట్రజేస్తున్న కాలం కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం, మెమొంటోలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విద్యను సామాజిక బాధ్యతగా గుర్తించాలి
Published Wed, Mar 11 2015 1:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement