2,215 షాపులు.. 41,119 దరఖాస్తులు
► సగటున ఒక్కో మద్యం దుకాణానికి 19కిపైగా దరఖాస్తులు
► ఒకే ఒక్క దుకాణానికి నిల్ టెండర్.. రేపు లాటరీ పద్ధతిన కేటాయింపు
► కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ ప్రక్రియ
► ఖమ్మంలో రికార్డు స్థాయిలో.. మెదక్‌లో తక్కువ పోటీ
► ఖజానాకు రూ.411.19 కోట్లు ఆదాయం..
► గతంలో కన్నా రూ.256 కోట్లు అదనం
సాక్షి, హైదరాబాద్: మద్యం దరఖాస్తులతోనే రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలకు మించిన ఆదాయం సమకూరింది. సగటున ఒక్కో మద్యం షాపునకు 19కి పైగా దరఖాస్తులు రావడంతో.. రాష్ట్ర ఖజానాకు రూ.411.19 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణలోని 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒక్క షాపు మినహా అన్నింటికీ టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 41,119 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ విభాగం వెల్లడించింది. మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్ పరిసరాల్లోని ఒక దుకాణానికి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. మిగతా అన్ని షాపులకు పోటీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లోని మద్యం షాపులకు పోటీ ఎక్కువగా కనిపించింది. కొన్ని జిల్లాల్లో మద్యం షాపుల లైసెన్సులకు వందలాది మంది క్యూ కట్టడంతో బుధవారం తెల్లారుజాము వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగిందని అధికారులు తెలిపారు. చివరి రోజే రాష్ట్రవ్యాప్తంగా 25,750 దరఖాస్తులు వచ్చాయి.
గతం కంటే రెండింతలకు పైగా..
2015లో రాష్ట్రంలో 31 వేల దరఖాస్తులు వస్తే.. రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది. అప్పటితో పోలిస్తే ఈసారి పది వేలకు పైగా దరఖాస్తులు పెరిగాయి. మరోవైపు దరఖాస్తుల ఫీజును రెండింతలు చేయటంతో ఆదాయం కూడా అంచనాలు దాటింది. అప్పటితో పోలిస్తే రూ.256 కోట్లు ఎక్కువ ఆదాయం వచ్చింది. 2015లో పలుమార్లు నోటిఫికేషన్ జారీ చేసినా రాష్ట్రంలో 72 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. ఈసారి మాత్రం అన్ని జిల్లాల్లోనూ అనూహ్య పోటీ కనిపించింది. మద్యం లైసెన్స్ ఫీజుల స్లాబ్‌లను కుదించటంతోపాటు గిరాకీ లేని ప్రాంతాల్లోని మద్యం షాపులను ఇతర ప్రాంతాలకు తరలించటం మంచి ఫలితం ఇచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే మద్యం షాపులను కేటాయించే విధానం తెలంగాణలో సులభతరంగా ఉండటం కలిసొచ్చిందని విశ్లేషించారు.
ఎన్నికల సీజన్‌తో పోటీ
రాబోయేది ఎన్నికల సీజన్ కావటంతో మద్యం షాపుల డిమాండ్ పెరిగిందనే అభిప్రాయాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ నాయకులు తమ అనుచరులతో దరఖాస్తులు చేయించారు. ఇప్పటికే మద్యం షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు తిరిగి తమ దుకాణాలు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతిన మద్యం షాపులను కేటాయిస్తారు. ఈనెల 22న నిర్వహించే లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దరఖాస్తుల్లో ఖమ్మం రికార్డు
రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని 83 షాపులకు రికార్డు స్థాయిలో 4,029 దరఖాస్తులు వచ్చాయి. ఆ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 49 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. అక్కడి 71 షాపులకు 3,043 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా మెదక్ జిల్లాలో 37 షాపులకు కేవలం 301 దరఖాస్తులే వచ్చాయి.