
‘భద్రాద్రి’ భగభగ
- నిప్పుల కొలిమిని తలపిస్తున్న కొత్తగూడెం జిల్లా
- భద్రాచలం, పాల్వంచ, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు
- రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు
- మే నెలలో 47 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు
- తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంగళవారం నిప్పుల కొలిమిని తలపించింది. జిల్లాలోని భద్రాచలంలో 44.2 డిగ్రీలు, పాల్వంచ మండలం యానాంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు, భద్రాచలం రూరల్‌లో 43.9 డిగ్రీలు, ఖమ్మం జిల్లా వైరాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో 42.6, ఖమ్మంలో 42.2, నల్లగొండ, నిజామాబాద్‌లలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఏప్రిల్ 11 నాటికి ఏనాడూ 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరలేదని వెల్లడించారు. ఏప్రిల్ మూడో వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే రికార్డు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2010 ఏప్రిల్ 23న హన్మకొండలో 44.3, గతేడాది ఏప్రిల్ 22న మెదక్‌లో 44.2 డిగ్రీలు, 26న మహబూబ్‌నగర్‌లో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఇంతకన్నా ముందుగా ఎక్కడా 44 డిగ్రీలు నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది.
మే నెల ఎండ ప్రచండమే
వచ్చే నెల వడగాడ్పుల తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మే నెలలో గరిష్టంగా 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతాయని, దీంతో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని తెలిపింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా అంటే వడగాడ్పులుగా లెక్కిస్తారని, ఆరు డిగ్రీల కన్నా అధికంగా ఉంటే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారని చెప్పింది. వడగాడ్పులు ఉన్నప్పుడు వేసవి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించింది.
విపత్తు నిర్వహణ శాఖ సూచనలు
ఆరుబయట పని చేసే ఉపాధి కూలీ పనులను ఉదయం వేళల్లోనే చేయించాలి. వడగాడ్పుల సమయంలో ప్రయాణాలను మానుకోవాలి. బస్సు వేళల్లోనూ మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులు నడపకూడదని వేసవి ప్రణాళికలో విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లోనూ వేసవి ప్రణాళికలు అమలు చేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.