పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని బీసీఎం రోడ్ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉన్న ఎంపీ రేణుకా చౌదరి భూములతోపాటు, చెరువుబంజర్, మేడికుంట చెరువు భూముల్లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ రేణుకాచౌదరి మూడు దశాబ్దాల క్రితం ఆక్సికో కర్మాగారం నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం నుంచి 43 ఎకరాలు తీసుకున్నారని, నేటికీ కర్మాగారం నెలకొల్పకపోగా.. మామిడితోట సాగు చేస్తున్నారని ఆరోపించారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆక్రమణలను అడ్డుకున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఆక్రమణలకు దిగవద్దని సూచించారు. తహసీల్దార్ విషయాన్ని సబ్ కలెక్టర్ కాళీచరణ్ ఎస్.కర్టేడ్ దృష్టికి తీసుకెళ్లగా భూములు సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.