
అల్పాదాయ వర్గాలకు ఉపశమనం!
విద్యుత్ చార్జీల పెంపు ప్రతి పాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.
* విద్యుత్ చార్జీల పెంపుపై డిస్కంల కసరత్తు పూర్తి
* 200 యూనిట్ల వరకు 50 పైసలు పెంచాలని ప్రతిపాదన
* ఉన్నత వర్గాలు, పరిశ్రమలపైనే అధిక భారం
* కనీసం యూనిట్‌కు రూ. 2 పెంచాలని యోచన
* హెచ్‌టీ కేటగిరీల విలీనంతో మరింత ఆదాయం
* ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించాక తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతి పాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. విద్యుత్ కోతలతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో వెనుకాముందాడుతోంది. పేద, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా చార్జీల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సూచించింది. దీంతో వార్షిక సగటు రాబడి అంచనా(ఏఆర్‌ఆర్)ల తయారీలో డిస్కంలు ఆఖరి కసరత్తు చేస్తున్నాయి. ‘ఏఆర్‌ఆర్‌ల తయారీ దాదాపుగా పూర్తయింది.
ఈఆర్‌సీ ఇచ్చిన గడువు ప్రకారం 12వ తేదీన సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్త రాష్ట్రం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై భారం మోపకూడదనేది సర్కారు ఆలోచన. 0-200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు దాదాపు ఇప్పుడున్న చార్జీలే అమలవుతాయి. ఒక్కో యూనిట్‌పై కనీసం 50 పైసలు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి నివేదించేందుకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేశాం. అల్పాదాయ వర్గాలపై 50 పైసల చొప్పున పెంచితే వారిపై ఎంత భారం పడుతుంది... ఇప్పుడున్న రేటునే కొనసాగిస్తే విద్యుత్ సంస్థలకు ఎంత నష్టం వస్తుంది వంటి విశ్లేషణలను అందులో పొందుపరిచాం. 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడే ఎల్‌టీ, హెచ్‌టీ కేటగిరీలన్నింటిలోనూ ఒక్కో యూనిట్‌పై కనీసం రూ. 2 చొప్పున పెంచాలనే ఆలోచన ఉంది. హెచ్‌టీ కేటగిరీలను విలీనం చేసే ప్రతిపాదనలున్నాయి. పీక్ అవర్స్‌లో అదనపు చార్జీలు కొనసాగుతాయి. అధికాదాయ వర్గాలు, పరిశ్రమల నుంచి ఎక్కువ చార్జీలను రాబట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి సూచనల మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనల్లో తుది మార్పులు చేస్తాం’ అని ఏఆర్‌ఆర్ తయారీలో పాలుపంచుకున్న ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
పెంపును 20 శాతానికి కట్టడి చేసే యత్నం
చార్జీల పెంపు ద్వారా వచ్చే ఏడాదిలో రూ. 4695 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకునేం దుకు డిస్కంలు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ప్రస్తుతమున్న చార్జీలను 22.52 శాతం పెంచాల్సి ఉంటుంది. కానీ అల్పాదాయ వర్గాలపై భారం లేకుండా సర్దుబాటు చేయడానికి ఈ పెంపును 15 నుంచి 20 శాతానికి కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం హెచ్‌టీ విభాగంలోని ఏడు కేటగిరీలను విలీనం చేస్తే ఆదాయం పెరుగుతుందని డిస్కంలు యోచిస్తున్నాయి. పరిశ్రమలు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కాలనీలు, సీజనల్ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటివి వివిధ కేటగిరీలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు రూ. 4.58 నుంచి రూ. 5.41 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ కేటగిరీని తొలగించి ఇతర పరిశ్రమలతో విలీనం చేస్తే తమపై చార్జీల భారం ఎక్కువగా పడుతుందని ఆ పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏఆర్‌ఆర్‌లు సమర్పించే గడువును తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్‌సీ) ఈ నెలాఖరుకు పొడిగించే అవకాశముంది. షెడ్యూల్ ప్రకారం 12వ తేదీలోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని డిస్కంలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈఆర్‌సీ చైర్మన్‌తోపాటు సభ్యులంతా ప్రస్తుతం అధికారిక పర్యటనపై కొచ్చిన్‌లో ఉన్నారు. వారంతా ఈ నెల 13న తిరిగి విధులకు హాజరవుతారు. దీంతో ఏఆర్‌ఆర్‌ల సమర్పణకు గడువు పొడిగించనున్నట్లు తెలిసింది.