ఊపిరి పీల్చుకున్న టీఆర్‌ఎస్!
-
మూడు జెడ్పీల్లో స్పష్టమైన మెజారిటీ
-
మరో రెండింటినీ దక్కించుకునే చాన్స్
-
మున్సిపల్ ఫలితాలతో పోల్చితే ఊరట
-
ఎంపీటీసీల్లోనూ కాంగ్రెస్‌తో హోరాహోరీ
-
సాధారణ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలపై ధీమా
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల్లో సంతృప్తికరమైన ఫలితాలు రావడంతో టీఆర్‌ఎస్ ఊపిరి పీల్చుకుంది. మంగళవారం నాటి ఫలితాలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. మూడు జిల్లా పరిషత్‌లను స్పష్టమైన ఆధిక్యతతో కైవసం చేసుకోవడంతో పాటు మరో రెండు జిల్లాల్లో పాగా వేసేందుకూ ఆ పార్టీకి అవకాశముంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోల్చితే.. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలను సాధించింది.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జెడ్పీలను దక్కించుకుంది. వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా ఎక్కువ జెడ్పీటీసీలను గెలుచుకుంది. కొంచెం ప్రయత్నిస్తే జెడ్పీ చైర్మన్ పదవిని పొంద వచ్చని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ పరమయ్యాయి. అయితే ఎంపీటీసీల విషయంలో మాత్రం కాంగ్రెస్ కంటే కొంత వెనుకబడింది.
కాగా, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పోటీలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మూడు జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ గెలవడం పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితే. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర ఫలితాలను సాధించకపోవడంతో పార్టీ కేడర్ నిరుత్సాహ పడింది. 50కిపైగా ఉన్న మున్సిపాలిటీల్లో కేవలం మూడింటిలోనే టీఆర్‌ఎస్‌కు మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్లలో కూడా ఒక్క కరీంనగర్‌లోనే మంచి ఫలితాలు వచ్చాయి. అయితే తాజాగా మూడు జెడ్పీలను నేరుగా గెలుచుకుని, కాంగ్రెస్‌తో పోటీపడి ఎంపీటీసీ స్థానాలను నెగ్గడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఊపుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలను సాధిస్తామన్న ధీమా గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
సాధారణ ఎన్నికల ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లే నిర్ణయాత్మకంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలోనే జరిగే పరిషత్ ఎన్నికల్లో పార్టీకి మద్దతు లభించడంతో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుపై టీఆర్‌ఎస్ నాయకుల్లో భరోసా పెరిగింది. పోలింగ్ సరళి ఇలాగే ఉంటే తెలంగాణలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికలయ్యాక అనేక పరిణామాలు జరిగాయని, ముఖ్యంగా టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి పలువురు బలమైన నాయకులు అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌లో చేరారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల సార్వత్రిక ఎన్నికల్లో తమకు మరింత ప్రయోజనం చేకూరిందని, గతంలో పార్టీ గెలవని ప్రాంతాల్లో కూడా ఈసారి పట్టు దొరికిందని విశ్లేషించుకుంటున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ పెద్దగా పట్టించుకోలేదు.
రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ప్రచారాన్ని నిర్వహించలేదు. ఎక్కడికక్కడ పోటీ చేసిన అభ్యర్థులే ఈ వ్యవహారం చూసుకున్నారు. అనంతరం సాధారణ ఎన్నికల కోసం పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు. అందువల్ల తాము ఎక్కువ సీట్లు గెలవడం ఖాయమని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి.