పల్లె పోరులో కారు జోరు | TRS dominates in Local body elections in Telangana Region | Sakshi
Sakshi News home page

పల్లె పోరులో కారు జోరు

Published Wed, May 14 2014 2:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

పల్లె పోరులో కారు జోరు - Sakshi

పల్లె పోరులో కారు జోరు

  • మూడు జెడ్పీలు టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు ఒకటి
  •  నాలుగింట హంగ్.. 
  •  టీడీపీ సీట్లే నిర్ణాయకం
  •  ఖమ్మం జెడ్పీ టీడీపీదే?
  •  తెలంగాణలో ఆసక్తికరంగా జిల్లా పరిషత్ పోటీ
  •  సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోయింది. తెలంగాణలో 9 జిల్లా పరిషత్‌లకు గాను మూడింట్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఒకే ఒక్క జెడ్పీతో సరిపెట్టుకుంది. ఖమ్మం జెడ్పీ టీడీపీకి వెళ్లేలా కన్పిస్తుండగా మిగతా నాలుగు జెడ్పీల్లో హంగ్ నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వెల్లడైన ఫలితాల్లో తెలంగాణలోని మొత్తం 441 జెడ్పీటీసీల్లో టీఆర్‌ఎస్ దాదాపు 200 దాకా కైవసం చేసుకుని అగ్ర స్థానంలో నిలిచింది. దాదాపు 170 జెడ్పీటీసీలతో కాంగ్రెస్ రెండో స్థానంలో, 40 స్థానాలతో టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు... నల్లగొండలో కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. అక్కడ అవి సొంతంగానే జెడ్పీ చైర్మన్‌గిరీనిదక్కించుకున్నాయి.
     
     హంగ్‌లో అదృష్టమెవరిదో...!
     మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లా పరిషత్‌లలో ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక మెదక్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు సమాన సంఖ్యలో సీట్లొచ్చాయి. ఖమ్మంలో మాత్రం టీడీపీ పెద్ద పార్టీగా అవతరించింది. ఈ జెడ్పీని అది సొంతంగా కైవసం చేసుకోవాలంటే మరో మూడు నాలుగు స్థానాలు కావాల్సి ఉంది. అక్కడ మూడు జెడ్పీటీసీ స్థానాల ఫలితాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మిగతా నాలుగు జిల్లాల్లో ఎవరైనా స్వతంత్రులు, ఇతర పక్షాల మద్దతుతో మాత్రమే జెడ్పీలను కైవసం చేసుకునే పరిస్థితి ఉంది.
     
     సీన్ రివర్స్...
     గత జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. అప్పుడు టీఆర్‌ఎస్‌కు నిజామాబాద్ జెడ్పీ మాత్రమే దక్కింది. మిగతా 8 జిల్లాల్లో దాని పరిస్థితి నామమాత్రమే. కాంగ్రెస్ ఆరు, టీడీపీ రెండు జెడ్పీలను దక్కించుకున్నాయి. ఈసారి మాత్రం నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జెడ్పీలను టీఆర్‌ఎస్ సొంతంగానే కైవసం చేసుకుంది. స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా పాగా వేసే దిశగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ ఒకే ఒక్క జెడ్పీతో రెండో స్థానానికి దిగజారింది. గతంలో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లా పరిషత్‌లను దక్కించుకున్న టీడీపీకి ఈసారి ఒక్కదాంట్లోనూ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు.
     
     రంగారెడ్డి, మెదక్, వరంగల్, పాలమూరుల్లో టీడీపీయే కీలకం
     మెదక్, వరంగల్ జిల్లాల్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. మెదక్‌లో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరో 21 వచ్చాయి. మిగతా 4 టీడీపీకి దక్కాయి. జడ్పీ పీఠం ఎవరికి దక్కాలన్నా టీడీపీ మద్దతు తప్పనిసరి! వరంగల్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. 50 వార్డులకు గాను టీఆర్‌ఎస్ 20, కాంగ్రెస్ 19, టీడీపీ 5 గెలిచాయి. ఆరింట ఇతరులు నెగ్గారు. టీడీపీ, స్వతంత్రుల మద్దతు లే కుండా ఎవరికీ మెజారిటీ (26) దక్కని పరిస్థితి! ఖమ్మంలో 46 జడ్పీటీసీ స్థానాలుండగా రెండింట ఎన్నికలు జరగలేదు. మిగతా 44 స్థానాల కు గాను టీడీపీ 20, కాంగ్రెస్ 9, వైఎస్సార్‌సీపీ 5, న్యూ డెమోక్రసీ 3, సీపీఐ 1, సీపీఎం 2 సీట్లు సాధించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 64 జడ్పీటీసీలకుగాను కాంగ్రెస్ 28, టీఆర్‌ఎస్ 23, టీడీపీ 8, బీజేపీ 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక్కడ కూడా టీడీపీ, బీజేపీ సీట్లే కీలకం కానున్నాయి. రంగారెడ్డిలో 33 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 14, టీఆర్‌ఎస్‌కు 10, టీడీపీకి 6 వచ్చాయి. మూడింట్లో ఫలితం తేలాల్సి ఉంది.
     
     హంగ్ పరిష్కారమయ్యేదెట్లా?
     హంగ్ ఫలితాలొచ్చిన నాలుగు జిల్లాల్లో సమస్య సులువుగా పరిష్కారమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో టీడీపీని ప్రధాన శత్రువుగా పరిగణించాయి. తెలంగాణ విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన టీడీపీని భూస్థాపితం చేయాలంటూ ఊరూరా ప్రచారం చేశాయి. చివరికి టీడీపీకి చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా అత్తెసరు సీట్లు వచ్చినప్పటికీ మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఆ పార్టీ సీట్లే కీలకం కానుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో టీడీపీ ఎవరికి మద్దతిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలకు టీడీపీ సమాన దూరం పాటిస్తే మరింత జటిలమయ్యే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రాజీకొస్తే హంగ్ సమస్య సులువుగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement