
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఎట్టకేలకు ఊపిరిపీల్చుకున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలి పేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమ వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాము ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశామని, అసెంబ్లీ రద్దు కావడంతో ధర్మాసనం ఆ అప్పీళ్లతో పాటు సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను కూడా మూసేసిందని, అయినా కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందుకెళ్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరు తూ నిరంజన్‌రావు, నరసింహాచార్యులు వేర్వే రుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సింగిల్ జడ్జి తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను మూసేసినా కూడా సింగిల్ జడ్జి మాత్రం విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా న్యాయ, అసెంబ్లీ కార్యదర్శులకు బెయిలబుల్ వారంట్లు జారీ చేయడమే కాక, కోర్టు ముందు హాజరైన తర్వాత వారిని తిరిగి హైకోర్టు రిజిస్ట్రార్ కస్టడీకి అప్పగించారన్నారు.
ఈ సమయంలో ధర్మాస నం.. కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయ వాది కోసం ఆరా తీసింది. అయితే ఏ ఒక్కరూ కోర్టులో లేకపోవడంతో, దీన్ని బట్టి ఈ కేసు పట్లవారు అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెషల్ జీపీ శరత్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్‌జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment