రోడ్డెక్కిన అద్దెబస్సులు
- మూడో రోజుకు చేరిన కార్మిక సంఘాల సమ్మె
- ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన అధికారులు
- రాకపోకలు సాగించిన 183 బస్సులు
- క్యాజువల్ డ్రైవర్, కండక్టర్ల తొలగింపు
- వంటావార్పు, ధర్నాలతో కార్మికుల నిరసన
- కొనసాగుతున్న ప్రైవేటు వాహనాల దోపిడీ..
నల్లగొండ : ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె మూడో రోజుకు చేరింది. విరమించే పరిస్థితి కనిపించకపోవడంతో రీజియన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం పలుచోట్ల అద్దె బస్సులు రోడ్డెక్కాయి. కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. విధుల్లోకి వచ్చిన ప్రైవేటు ఉద్యోగులను అడ్డుకున్నారు. నల్లగొండ నుంచి దేవరకొండ వెళ్తున్న బస్సును కనగల్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనపై అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల మీద ప్రైవేటు వాహనాల దోపిడీ రోజురోజుకీ పెరుగుతోంది.
ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్టీసీ..ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సేవలు వినియోగించుకుంటోంది. శనివారం నుంచి మరిన్ని అద్దె బస్సులను రోడ్డుమీద తిప్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. డిపోనకు 40 బస్సుల చొప్పున శనివారం మరో 280 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 183 బస్సులు వివిధ మార్గాల్లో ప్రయాణించగా వాటిల్లో ఆర్టీసీ 33, అద్దె బస్సులు 150 ఉన్నాయి. నల్లగొండ డిపో నుంచే 23 బస్సులు వివిధ ప్రాంతాలకు పంపించారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మిగిలిన బస్సులను అక్కడి నుంచే ఆపరేట్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ సహాయంతోనే బస్సులు ప్రయాణించాయి. ఇదిలావుంటే క్యాజువల్ కండక్టర్లు, డ్రైవర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆర్‌ఎం బి.రవీందర్ అన్ని డిపోలకు ఉత్తర్వులు జారీ చేశారు.
సంఘాల నిరసనలు..
నల్లగొండ డిపో వద్ద ధర్నా చేస్తున్న సంఘాలకు వివిధ పార్టీల అనుంబంద సంఘాలు సంఘీభావం తెలిపాయి. పోలీస్ ఎస్కార్ట్‌తో భువనగిరి ప్రాంతంలో నల్లగొండ, గజ్వెల్ ప్రజ్ఞాపూర్, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు, కొన్ని ప్రైవేట్ బస్సులు నడిచాయి. గ్రామాలకు కాకుండా పట్టణ ప్రాంతాలకు బస్సులు పంపించారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైవేపై నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవరకొండ డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది.
ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేశారు. కోదాడలో కార్మికులు డిపో నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను బయటకు పంపడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా చేరేందుకు ప్రయత్నించగా వారిని కూడ కార్మికులు అడ్డుకొని డిపో లోనికి వెళ్లనీయలేదు. మిర్యాలగూడ డిపోలో బస్సులు గేటు బయటకు రాలేదు. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపోలోనే మధ్యాహ్న భోజనాలు చేశారు.
కార్మికుల సమ్మెకు సీపీఐ, బీజేపీ, స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. సూర్యాపేటలో బస్టాండ్ ఆవరణ నుంచి ఒక్క బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. అలాగే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.