
‘నామినేటెడ్’కు కుదరని ముహూర్తం!
♦ మంచి రోజుల్లేవంటూ పదవుల భర్తీ వాయిదా
♦ మరో 2 నెలలు గులాబీ నేతలకు తప్పని నిరీక్షణ
♦ పాత నాయకులతో సీఎం కేసీఆర్ మంతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం కొలిక్కి రావట్లేదు. రేపూమాపూ అంటూ పార్టీ అధినాయత్వం చేస్తున్న ప్రకటనలతో ద్వితీయ శ్రేణి నాయకులకు నిరీక్షణ తప్పట్లేదు. ప్రస్తుతం మూఢాలు, ఆ తర్వాత ఆషాడ మాసం ఉందని...అందువల్ల మరో రెండు నెలల దాకా పోస్టుల భర్తీకి బ్రేక్ పడినట్టేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వాయిదాల మీద వాయిదాలు
ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవులు భర్తీ చేసి ఉంటే ఒక బ్యాచ్‌కు పదవీ కాలం (రెండేళ్లు) పూర్తయ్యి, రెండో బ్యాచ్‌కు అవకాశం వచ్చేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యకర్తలకు పంచనున్న పదవులపై కేసీఆర్ ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్టీ 14వ ప్లీనరీలో, ఇటీవలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా, తాజాగా ఖమ్మంలో జరిగిన 15వ ప్లీనరీ సందర్భంగా పదవుల భర్తీపై సీఎం ప్రకటనలు చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. ఈ కారణంగానే కనీసం పార్టీ పదవులైనా దక్కుతాయని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురయింది.
పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ను రెండేళ్ల పదవీ కాలానికి పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. కానీ 15వ ఆవిర్భావ దినోత్సవం నాటికి కూడా రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఏడాదికిపైగా కేవలం అధ్యక్షునితోనే పార్టీ కొనసాగింది. కనీసం ఇప్పుడైనా రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌బ్యూరో, ఇతర అనుబంధ సంఘాల పదవులు భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్న వారికి నీరసం వ స్తోందని చమత్కరిస్తున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులూ భర్తీ కాక, పార్టీ పదవులూ దక్కక గులాబీ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనవుతున్నాయనని పేర్కొంటున్నారు.
పాత నేతలతో టచ్‌లో సీఎం కేసీఆర్
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీని యర్లు, పాత నేతల్లో విశ్వాసం పెంచేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్కెట్ కమిటీల పాలక మండళ్లను నియమించింది.
అలాగే ఆర్టీసీ చైర్మన్ పదవిని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు, రాష్ట్ర సాంస్కృతి సారథి చైర్మన్ పదవిని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు, మిషన్ భగీరథ చైర్మన్ పోస్టు ను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని గత ఎన్నికల్లో ఓడిపోయిన పిడమర్తి రవితో భర్తీ చేసింది. దీంతో ముందు నుంచీ పార్టీలో ఉన్నవారు, ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న వారు ఒకింత కినుక వహించారన్న సమాచారంతో కేసీఆర్ కొందరిని తన వద్దకు పిలిపించుకొని మాట్లాడినట్లు సమాచారం. మరికొందరికి ఫోన్లు కూడా చేసి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు.