
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రుద్రారంలోని 183వ నంబర్ పోలింగ్ బూత్‌లో శుక్రవారం ఉదయం పోలింగ్ ఏజెంట్లతో నిర్వహించిన మాక్ పోలింగ్ ద్వారా వేసిన ఓట్లను తొలగించకుండానే పోలింగ్ కొనసాగించారు. ఈ కేంద్రంలో మొత్తం 565 ఓట్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 518 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తం ఓట్లను సరిచూసుకోగా 555 ఓట్లు పోలైనట్లు కనిపించింది. వాస్తవ ఓట్ల కంటే 37 ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసేందుకు నిరాకరించి వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి బిక్కుసింగ్ సెక్టోరియల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఓటింగ్ యంత్రాలను సీజ్ చేసి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. మాక్ ఓటింగ్ క్లియర్ చేయడాన్ని ప్రిసైడింగ్ అధికారి మర్చిపోయారని, ఇదే విషయాన్ని ఈసీకి నివేదించామని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామని, రీపోలింగ్ జరిపే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment