- విహారయాత్రలో విషాదం
- బొమ్మకూరు జలాశయంలో ఘటన
నర్మెట, న్యూస్‌లైన్ : సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థిని మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో ప్రమాదశాత్తూ పడి గల్లంతైన సంఘటన శుక్రవా రం జరిగింది.మండలంలోని మరియపురం గ్రామానికి చెందిన తిర్మల్‌రెడ్డి భాస్కర్‌రెడ్డి, మరియమ్మ దంపతుల చిన్నకూతురు సింధూ(14) మరియపురంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
ఎన్నికల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తన మిత్రులు స్థానిక చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న కమాల్‌రెడ్డితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నందున తనను కూడా పంపించాలని పట్టుబట్టింది. దీంతో తల్లిదండ్రులు అంగీకరించారు.
అనంతరం తన మిత్రులు సృజన, ఆనందవర్షిత, జీవని, హర్షిత్, రాజశేఖర్‌తోపాటు ఫాదర్ కమాల్‌రెడ్డి బొమ్మకూరు రిజర్వాయర్‌కు విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం వారి వెంట తీసుకెళ్లిన భోజనం తిన్నారు. అందరిలో మొదటగా తిన్న సింధూ, సృజన చేతులు కడుక్కోవడానికి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ సింధూ నీళ్లలో పడిపోయింది. పక్కనే చేతులు కడుక్కుంటున్న సృజన ఆందోళనకు గురై వెంటనే వెళ్లి మిత్రులకు, ఫాదర్ కమల్‌కు చెప్పడంతో వారు పరుగెత్తుకొచ్చారు. అయితే అప్పటికే సింధూ నీట మునిగింది. వెంటనే ఫాదర్ కమాల్ స్థానికులకు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఆమె జాడ తెలియరాలేదు.