సమస్యలపై స్పందిస్తే ద్రోహులంటారా?
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, పెద్ద ఎత్తున విద్యుత్తు కోతలతో రైతులు అల్లాడుతుంటే ప్రత్యామ్నాయాలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి... సమస్యలమీద స్పంది స్తున్నవారిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ ద్రోహులుగా ముద్రవేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. వానలు కురవకపోతే మనం చేసేదేమీ లేదని, కానీ కరెంటు ఇవ్వటం ద్వారా బోర్ల కింద పంటలను కాపాడుకునే ప్రయుత్నం చేయువచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అతిముఖ్యమైన ఆ విషయాన్ని గాలికొదిలేసి హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తానని, కరీంనగర్‌ను లండన్‌లాగా మారుస్తానని, పోలీసులకు న్యూయార్క్ పోలీసు తరహా యూనిఫామ్ ఏర్పాటు చేస్తాన ంటూ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నతీరు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఆదివారం ఆయన బీజేఎల్పీ నాయుకుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కమిటీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, రఘునందన్‌రావు, మనోహర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌లతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వానలు లేక, కరెంటు రాక, ఖరీఫ్ రుణాలందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని విమర్శించారు. ‘రైతు ఏడిస్తే రాజ్యం ఉండదు, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం సాగదు, మహిళ ఏడిస్తే శుభం జరగదు’ అనే నానుడి ఇప్పుడు తెలంగాణలో నిజం అవుతోందని అన్నారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పిన కేసీఆర్... ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తే తిన్నదరగక అలా చేస్తున్నారని అన్నారు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇటీవల బీజేపీలో చేరిన తాను త్వరలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి అధికారికంగా తన పార్టీ ఆర్‌ఎల్‌డీని బీజేపీలో విలీనం చేస్తానని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పేర్కొన్నారు.