బాధ్యత లు మరవొద్దు | Responsible for the maravoddu | Sakshi
Sakshi News home page

బాధ్యత లు మరవొద్దు

Published Wed, Nov 12 2014 3:54 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

బాధ్యత లు మరవొద్దు - Sakshi

బాధ్యత లు మరవొద్దు

కరీంనగర్ సిటీ : ‘‘మీ పాత్ర మీరు నిర్వహించడం లేదు... పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏం కావాలో ప్రతిపాదనలు పంపించాలని గత సమావేశంలోనే చెప్పాం... ఇప్పటివరకు మీ నుంచి ఎలాంటి స్పందనా లేదు... డీఈఓగా బాధ్యతలు మరిచిపోతే ఎలా...’’ అంటూ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ జిల్లా విద్యాశాఖాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఉదయం జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, మధ్యాహ్నం విద్య, వైద్యంపై చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ సమావేశమందిరంలో జరిగాయి. ఈ సమావేశాల్లో సభ్యులు జిల్లా అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని... చెప్పింది చేయడం లేదని... ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

 తాగితందనాలాడితే చర్యలేవి?
 దేవాలయాల్లాంటి పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు తాగి తందనాలాడితే వారిపై చర్యలేవని సభ్యులు ప్రశ్నించారు. విద్య, వైద్యంపై జరిగిన సమావేశంలో ముందుగా తుల ఉమ మాట్లాడుతూ.. కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని డీఈఓను ప్రశ్నించారు.

జిల్లా కేంద్రంలోని పాఠశాలలోనే మద్యం తాగి చిందులేసిన వాళ్లను సస్పెండ్ చేసి నెల రోజులైనా గడవకముందే ఎలా విధుల్లో చేర్చుకున్నారని ఇల్లంతకుంట జెడ్పీటీసీ సభ్యుడు సిద్దం వేణు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే వారిపై సస్పెన్షన్ ఎత్తివేశామని డీఈఓ లింగయ్య సమాధానమిచ్చారు.

తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒకరకంగా, లేని వారికి మరొకరకంగా డీఈఓ వ్యవహరిస్తున్నాడని వేణు ఆరోపించారు. ఎస్‌జీటీ ఉపాధ్యాయుడికి బీఈడీ చదవడానికి ఆన్‌డ్యూటీ సదుపాయం ఇవ్వడంలో అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై డీఈఓ స్పందిస్తూ గతంలో పొరపాటున ఒకరికి అలా ఇచ్చామని, మరోసారి అలాంటి తప్పు చేయలేమన్నారు.

      ఇబ్రహీంపట్నం, పెద్దపల్లి జెడ్పీటీసీ సభ్యులు జంగిలి సునీత, యాట దివ్య మాట్లాడుతూ.. పాఠశాలల్లో మూత్రశాలలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. పాఠశాల ప్రహరీ కన్నా మూత్రశాలలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. పెద్దపల్లి, రామగుండం, మంథని, ముత్తారం మండలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎన్‌టీపీసీ నిర్ణయించిందని, త్వరలో సమస్య తీరిపోతుందని డీఈఓ చెప్పారు.

      జిల్లాలో డెంగీ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్లేట్‌లెట్ మిషన్ పనిచేస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. చాలా ఆసుపత్రుల్లో ల్యాబ్‌టెక్నిషయన్లు లేరని, దీంతో వ్యాధి నిర్ధారణ కూడా సాధ్యం కావడం లేదన్నారు. వికలాంగుల వైకల్య నిర్ధారణకు సదరం క్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో ఫించన్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

జిల్లా ఆసుపత్రిలో క్యాంపు పెట్టినా, ఏర్పాట్లలో అధికారులు విఫలం కావడంతో వేలాది మంది వికలాంగులు ఇబ్బందులు పడ్డారన్నారు. అన్ని మండలాల్లో సదరన్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని, అలా కాని పక్షంలో కనీసం నియోజకవర్గానికో క్యాంపును నాలుగైదు రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నంబయ్య, డెప్యూటీ సీఈఓ గౌతంరెడ్డి, సభ్యులు చల్ల ప్రగతి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 విత్తనాలపై అధికారుల వింత లెక్కలు..
 ‘ఆరు వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు తెప్పించామని, పత్తి విత్తనాలు ఇచ్చామని నివేదికలో చెబుతున్నారు... వాస్తవంగా ఎక్కడా విత్తనాలు కనిపించడం లేదు... మాకిచ్చిన రిపోర్ట్‌కు, అధికారులు చదివేదానికి పొంతన ఉండడం లేదు... మేమేమన్నా పిచ్చోళ్లమా’ అంటూ వ్యవసాయ శాఖ అధికారులపై సభ్యులు ధ్వజమెత్తారు.

వ్యవసాయ శాఖపై జరిగిన సమావేశంలో నారా బ్రహ్మయ్య మాట్లాడుతూ.. జిల్లాలో తమకైతే ఎక్కడా విత్తనాలు కనిపించడం లేదన్నారు. అంబటి గంగాధర్, గోనె శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. పనిముట్లు ఎక్కడిచ్చారో తెలియడం లేదని, ఏఓలను అడిగినా చెప్పడం లేదన్నారు. అడిగితే కూడా అధికారులు సమాచారం ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏఓలు తప్పించుకున్నట్లున్నారని, తానెప్పుడో సర్క్యులర్‌లు జారీ చేశామని వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్ చెప్పారు.

దీనిపై వైస్‌చైర్మన్ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌ను అయిన తనకే ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని, సర్క్యులర్‌లు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు సర్క్యులర్ ఇస్తామని ఏడీ అనడంతో జెడ్పీ సీఈఓ నంబయ్య ఇది పద్ధతి కాదు.. కూర్చొండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

      పంట నష్టపరిహారం అందలేదని సరోజన సభ దృష్టికి తీసుకొచ్చారు. సీజన్‌కు ముందు ఏఓలతో అవగాహన సదస్సులు పెట్టిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందని గంగాధర్ సూచించారు. 99 శాతం పంట రుణాలు ఇచ్చామని జేడీ చెప్పడంపై శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. పంట రుణాలు వచ్చాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసరడంతో, పరిశీలిస్తానని జేడీ చెప్పారు.

      మంథని ఎఫ్‌డీఓ తీరుపై చొప్పరి సదయ్య ఫిర్యాదు చేశారు. తాము సభలో లేవనెత్తిన అంశాలపై స్థానికంగా మత్స్యకారులను వేధిస్తున్నారన్నారు. అడవులు అంతరించిపోతున్నా అధికారుల నిఘా లేదని జనగామ శర్‌తరావు అన్నారు. అటవీశాఖ రక్షణలో ఉన్న టింబర్ డిపో నుంచే ఎర్రచందనం చెట్లు కొట్టుకుపోయారని, అక్రమాలకు ఇది తార్కాణమని సదయ్య అన్నారు.

నాలుగు చెట్లు కొట్టుకుపోయింది వాస్తవమేనని, విచారణ చేస్తున్నామని డీఎఫ్‌ఓ సమాధానమిచ్చారు. జెడ్పీటీసీలు, ఎంపీపీల ఆమోదంతోనే వివిధ పథకాలను మండలాల్లో గ్రౌండింగ్ చేయాలని సభ్యులు సూచించారు. కాగా పాఠశాల సమస్యలపై విద్యాశాఖ, ఆర్‌వీఎం, ఆర్‌డబ్ల్యుఎస్ అంటూ తప్పించుకోవడం సరికాదని, ఒకే శాఖ జవాబుదారి తనంగా ఉండాలని తీర్మానం చేస్తున్నట్లు తుల ఉమ తెలిపారు.

 డెప్యూటీ సీఈఓ హల్‌చల్
 జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో ఇన్‌చార్జి డెప్యూటీ సీఈఓ గౌతంరెడ్డి హల్‌చల్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, సీఈఓల సమక్షంలోనే వేదికపై కూర్చొని అధికారులపై ఆజమాయిషీ చేశారు. తన స్థాయికి మించి జిల్లా అధికారులకు సైతం వేదిక సాక్షిగా సూచనలు, ఆదేశాలు, మందలింపులతో ఠారెత్తించారు. సాధారణంగా స్థాయీ సంఘ సమావేశాల్లో వేదికపై ఆ సంఘం చైర్మన్, సీఈఓ మాత్రమే కూర్చుంటారు. సీఈఓ లేని సమయంలో మాత్రమే డెప్యూటీ సీఈఓకు అవకాశం వస్తుంది.

కానీ మంగళవారం జరిగిన రెండు సమావేశాల్లోనూ డెప్యూటీ సీఈఓ వేదికపై ఉండడమే కాకుండా అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించారు. సిరిసిల్ల ఎంపీడీఓగా ఉన్న గౌతంరెడ్డి ఇటీవలే ఇన్‌చార్జి డెప్యూటీ సీఈఓగా నియమితులయ్యారు. ఆయన స్థాయి ఎంపీడీ ఓ అయినప్పటికీ, అవసరం లేకున్నా జోక్యం చేసుకొంటూ జిల్లా అధికారులను పలు సందర్భాల్లో ఆదేశించారు.

ఁఅసలు మీతో అవుతుందా... లేదా చెప్పండి ముందు* అంటూ నిలదీశారు. జెడ్పీటీసీల ప్రశ్నలను ఆయనే కొనసాగిస్తూ పలు సూచనలు చేశారు. డెప్యూటీ సీఈఓ వైఖరితో జిల్లా అధికారులు బిత్తరపోయారు. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, సీఈఓల సమక్షంలోనే డెప్యూటీ సీఈఓ వివాదాస్పదంగా వ్యవహరించడంతో అధికారులు లోలోన ఆయన పెత్తనంపై మండిపడ్డారు.
 
 మాఫియాను ప్రోత్సహిస్తున్నరు
 
 ఫర్టిలైజర్స్‌లో మాఫియా పెత్తనం కొనసాగుతోందని, దీనిని వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోందని ముత్తారం జెడ్పీటీసీ సదయ్య చేసిన ఆరోపణలతో, ఆయనకు వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్‌కు తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇలా అయితే రైతులు కొడుతారంటూ సదయ్య హెచ్చరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జేడీఏ మాఫియా అంటే ఏంటని, మాఫియా అనొద్దని, మేం కూడా పనిచేస్తున్నామని, కొడితే కొట్టండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి పాల్పడుతుండడంతో తుల ఉమ, రాజిరెడ్డి వారించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement