ఈనెల 29 వరకు రేవంత్ కస్టడీ పొడిగింపు
* ఓటుకు నోటు కేసు నిందితులకు 29 వరకు రిమాండ్
* ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామన్న ఏసీబీ
* స్టీఫెన్‌సన్ వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని మెమో దాఖలు
* కుట్రను తేల్చేందుకు మరిన్ని ఆధారాలు సేకరించాలి
* నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులకు రిమాండ్‌ను కోర్టు ఈ నెల 29 వరకు పొడిగించింది. ఈ వ్యవహారంలో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహ సాహూల రిమాండ్ ముగియడంతో సోమవారం ప్రత్యేక కోర్టు జడ్జి లక్ష్మీపతి ఎదుట వారిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని కోరుతూ ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ సోమవారం కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసుతో ప్రమేయమున్న టీడీపీ నేతల సంభాషణలను విశ్లేషించి ఫోరెన్సిక్‌ల్యాబ్ ఇచ్చే నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. ఈ కేసులో ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద జడ్జి ముందు నమోదు చేయాల్సి ఉందని, అందువల్ల నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని కోరింది. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు జెరూసలేం మత్తయ్య ఆచూకీ కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది.
అలాగే ఓటు కొనుగోలులో భాగంగా స్టీఫెన్‌సన్‌కు ఇస్తానన్న రూ. 5 కోట్లలో రూ. 50లక్షలు రేవంత్ దగ్గర స్వాధీనం చేసుకోగా.. మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో కనిపెట్టాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. దర్యాప్తు కీలకదశలో ఉందని, స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణలకు సంబంధించిన ఆడియో, వీడియో సీడీల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనకు పంపామని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాప్తును కొనసాగించాల్సి ఉందని ఏసీబీ తెలిపింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని వివరించింది. నిందితులు పలుకుబడి కలిగిన వ్యక్తులని, కేసు దర్యాప్తును ప్రభావితం చేయకుండా వారి రిమాండ్‌ను పొడిగించాలని మెమోలో కోరింది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ కేసులో నిందితుల రిమాండ్‌ను 29 వరకు పొడిగించింది. అనంతరం వారిని భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వేం నరేందర్‌రెడ్డి ఈ సందర్భంగా కోర్టుకు వచ్చారు.