'రూ. నాలుగున్నర కోట్లపై దర్యాప్తు చేయాల్సి ఉంది'
హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఏసీబీ దాఖలు చేసిన మెమోలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం కూడా రికార్డు చేయాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. దీంతో పాటు ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తుల హస్తం ఉందని కోర్టుకు దాఖలు చేసిన మెమోలో పేర్కొన్నారు. స్టీఫెన్సన్ కు ఇచ్చిన రూ. 50లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు?, మరో నాలుగున్నర కోట్లు ఎక్కడి నుంచి తేనున్నారో అనే అంశాలపై ప్రధానంగా దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అందుచేత రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగించాలని ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన మెమోలో పేర్కొన్నారు.
సోమవారం రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీని మరో మరో 14 రోజుల పాటు ఏసీబీ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఈనెల 29 వరకు రేవంత్ రెడ్డి పోలీస్ కస్టడీని పెంచింది. రేవంత్ రెడ్డితో పాటు ఉదయసింహా, సెబాస్టియన్ కస్టడీని కూడా న్యాయస్థానం పొడిగించింది. వీరి ముగ్గురికి అంతకుముందు విధించిన కస్టడీ నిన్నటితో ముగియడంతో వీరిని నేడు కోర్టులో హాజరుపరిచారు. ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందాల్సి ఉందని, దర్యాప్తు పెండింగ్ ఉందని కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితుల కస్టడీని పెంచింది.