
మా బాసే పంపించాడు
* నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సంభాషణ
* ఏదైనా ప్రాబ్లం వస్తే ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు
* 5 కోట్లు డీల్.. చాలా కాన్ఫిడెన్షియల్.. రెండు, రెండున్నర అయితే ఇప్పుడే ఇస్తా
* సెంట్రల్‌లో, ఏపీలో మాదే గవర్నమెంట్.. తెలంగాణలో నేనే పార్టీ కీ పర్సన్
* ఆంధ్రలో జగన్ ఉన్నాడు కాబట్టి తెలంగాణలో చంద్రబాబు రెడ్లను ప్రమోట్ చేస్తున్నాడని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే ఎమ్మెల్యే కొనుగోలు డీల్ నడిచింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు చెప్పారు. రెండు రోజుల కింద రేవంత్‌రెడ్డి నేరుగా స్టీఫెన్‌సన్ బంధువు ఇంటికి వచ్చి డీల్ కుదిర్చిన వ్యవహారంతో పాటు ఆదివారం ఏసీబీకి పట్టుబడక ముందు రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ జరిపిన సంభాషణ మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డయింది. రెండు రోజుల కింద డీల్ కుదిర్చినప్పుడు రేవంత్ చెప్పిన మాటలు..
‘తెలంగాణలో నేనే పార్టీ కీ పర్సన్‌ను. మీ(స్టీఫెన్‌సన్) మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే జిమ్మి, మట్టయ్య(స్టీఫెన్‌సన్ సన్నిహితులు)లను అప్రోచ్ అయ్యా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలి. మా బాస్(చంద్రబాబు)కు విషయం చెప్పా. బాసే మీ దగ్గరికి పంపించాడు. మీరేదైనా నెంబర్ చెబితే దాని గురించి ఆయనతో మాట్లాడుతా. ఈ వ్యవహారాన్ని మీ పార్టీ గుర్తించలేదు. మీరేం కావాలన్నా బాబు దగ్గరికి తీసుకెళ్తా. ఇది వంద శాతం కాన్ఫిడెన్షియల్. ఫైనాన్షియల్‌గా అయితే రెండూ రెండున్నర ఇవ్వగలం. టీడీపీలో నేనో ఇంపార్టెంట్ పర్సన్‌ను. నేనే తెలంగాణలో పార్టీని చూసుకుంటున్నా. బాబు కూడా నా వర్త్ గుర్తించారు. నావల్లే ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. నేను వేం నరేందర్‌రెడ్డికి ఫైనాన్స్ చేస్తున్నా.
మీరు ఓటేస్తారనే క్లారిటీ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. ఏపీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఇంకా ఫైనల్ కాలేదు. మీకేమైనా ప్రాబ్లం వస్తే ఏపీలో ఇప్పిస్తా. నన్నెప్పుడైనా కలవొచ్చు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఉంటాను. కొంత అడ్వాన్స్ ఇస్తాం. మరికొంత డిపాజిట్ చేస్తాం. మీకు అమౌంట్ కావాలంటే ఇప్పుడే ఇస్తాం. మీరెక్కడ కావాలంటే అక్కడ అందిస్తాం. ఈ ఎమ్మెల్సీ సీటు గెలవడం, ఓడడం వల్ల ఒరిగేదేమీ లేదు. కానీ చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ నడుస్తోంది. దట్స్ వై దిస్ గేమ్ స్టార్టెడ్. మీకు ఏప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ విల్ టేక్ కేర్. బాబు దగ్గర కూచోబెడతా. మాట్లాడిస్తా. నేను మధ్యవర్తిని. మీకు ఏ అవసరమొచ్చినా అవుట్ అండ్ అవుట్. నేనే ఎమ్మెల్సీని నిలబెట్టా. అతను నాకు కావలసిన వ్యక్తి. ఆరునెలల్లో పార్టీ ప్రెసిడెంట్‌ను నేనే అవుతున్నా. ఇప్పుడే మహానాడులో ఇస్తానంటే నేనే వద్దన్నా. నా కూతురి పెళ్లి తరువాత ఫ్రీ అవుతా. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో రెడ్డీస్‌దే డామినేషన్. కేసీఆర్‌ను అప్పోజ్ చేసే గ్రూప్ ఇదే. ఆంధ్రా, రాయలసీమకు చెందిన రెడ్డీస్ కూడా తెలంగాణలో మాకే సపోర్టు చేస్తారు. ఆంధ్రాలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టి తెలంగాణలో బాస్ రెడ్డీస్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడున్న కమ్మలు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా రెడ్డీస్‌ను ప్రమోట్ చేస్తున్నారు. నేను 25 ఏళ్లు పాలిటిక్స్‌లో ఉంటాను. నాకు క్యాస్ట్ ఉంది. బంధువులు ఉన్నారు. జైపాల్‌రెడ్డి నాకు మామ అవుతాడు. జానారెడ్డి కూడా నాకు బంధువే. జానారెడ్డి పని అయిపోయింది. కేసీఆర్‌తో మేం కొట్లాడలేమని జానారెడ్డి అన్నరు. నా వెనకాలే ఉండి జానారెడ్డి ప్రమోట్ చేస్తానన్నారు. సెంట్రల్‌లో, ఏపీలో మేమే గవర్నమెంట్‌లో ఉన్నం. కేంద్రంలో కూడా ఏమైనా కావాలంటే ఇస్తం..’
ఒకరు ఓటేయలేదనే తెలుస్తుంది..
‘ఒక్కో ఎమ్మెల్సీకి 17 మంది ఎమ్మెల్యేలను కేటాయిస్తరు. మీకు ఒక ఎమ్మెల్సీకి ఓటేయాలని లెక్క చెపుతారు. మీరు మాకు ఓటేసినా పిన్‌పాయింట్‌గా మీరేనని తెలియదు. 20 ఏళ్లుగా మేం చూస్తున్నాం కదా. ఆ గ్రూప్‌లో ఒకరు తగ్గారని తెలుస్తుంది అంతే. కూకట్‌పల్లి కృష్ణారావు వేస్తానంటున్నాడు కానీ డౌటే. ఏపీలో, సెంట్రల్‌లో ఏమైనా చేయగలం. నేను పోయి బాస్‌తో మాట్లాడుతా. ఇవ్వాళ జరిగింది నేను వెళ్లి బాస్‌తో ఫీడ్ చేస్తా.’
ఆదివారం ఏసీబీ ట్రాప్‌కు ముందు సంభాషణ..
రేవంత్‌రెడ్డి: 50 లక్షలు తెచ్చాను. అడ్వాన్స్. నాకు మీ హెల్ప్ కావాలి. మీకు ఏం కావాలో చెప్పండి.
స్టీఫెన్‌సన్: నేను సాధారణ మనిషిని. మీరేం కోరుకుంటున్నారు. ఏం ఇస్తారో చెప్పండి.
రేవంత్: ఇప్పుడు ఫిఫ్టీ తీసుకోండి. మిగతా నాలుగున్నర కోట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అప్పుడు ఇస్తా. బయట ఎవరికి తెలియదు.
స్టీఫెన్: నా లైఫ్ రిస్క్ కదా..
రేవంత్: అవును రాజకీయంగా పెద్ద డీల్. 5 కోట్లు కదా. నేను రిస్క్ చేస్తున్నాను. మనం ఓ పనిచేద్దాం. చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తా. మీరు నాతో, తనతో (బాబు) మాట్లాడాల్సిన పనిలేదు. బాబు ఏం హామీ ఇచ్చారో అది మీకు రెండు గంటల్లో అందుతుంది. ఈ వ్యవహారం పూర్తి రహస్యంగా ఉంటుంది. నన్ను బాసే పంపించారు. నాకు మీ సపోర్టు కావాలి. మీకేం కావాలన్న చేయడానికి బాబు ఉన్నారు.