
మాట్లాడింది బాబే..
నా ఓటుకు మరో నాలుగున్నర కోట్లు ఇస్తానని బేరమాడారు
‘ఓటుకు కోట్లు’ కుట్రను బట్టబయలు చేసిన స్టీఫెన్‌సన్
కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం
ప్రత్యక్ష సాక్షులుగా స్టీఫెన్‌సన్ కుమార్తె జెస్సికా, బంధువు మార్క్‌టేలర్
ఈ ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న
నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
ఈ వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనన్న స్టీఫెన్‌సన్
టీడీపీకి చెందిన కీలక వ్యక్తుల పాత్రపైనా వివరణ
నేడు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సీల్డ్‌కవర్‌లో పంపించే అవకాశం
భయపడాల్సిన పనిలేదు, నేనున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలసి పని చేద్దామంటూ ఆహ్వానించారు..
- స్టీఫెన్‌సన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పన్నిన కుట్రను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ బట్టబయలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుతోపాటు టీడీపీ ముఖ్య నేతల కీలక పాత్రను బహిర్గతం చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే తమ వాళ్లు ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.4.5 కోట్లు ఇస్తామని చంద్రబాబు నేరుగా తనకు హామీ ఇచ్చారని స్టీఫెన్‌సన్ వాంగ్మూలంలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘భయపడాల్సిన పని లేదు, తానున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలసి పనిచేద్దామంటూ ఆహ్వానించారు..’ అని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతల పేర్లతోపాటు కీలక సమాచారాన్ని కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలను అందజేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ డబ్బు ఇవ్వజూపిన దృశ్యాలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి.
అంతేకాదు మరికొందరు ఎమ్మెల్యేలనూ కొనుగోలు చేసేందుకు చంద్రబాబుతో పాటు ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు చేసిన కుట్ర మొత్తం ఏసీబీ జరిపిన దర్యాప్తులో బయటపడింది. దీంతో ఈ కేసులో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఏసీబీ అధికారులు.. కుట్రలో భాగస్వాములందరికీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్‌సన్, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆయన కుమార్తె జెస్సికా, ఆయన బంధువు మార్క్‌టేలర్‌ల వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. ఈ మేరకు నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) సెక్షన్ 164 కింద హైదరాబాద్‌లోని నాంపల్లి మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరుపతి బుధవారం వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటిని గురువారం సీల్డ్‌కవర్‌లో ఏసీబీ ప్రత్యేక కోర్టుకు పంపనున్నట్లు తెలిసింది. ప్రత్యేక కోర్టు నుంచి ఏసీబీ అధికారులు ఈ వాంగ్మూలాన్ని అధికారికంగా తీసుకుని.. ‘ఓటుకు కోట్లు’ కుట్రలో పాత్రధారులుగా ఉన్న వారికి నోటీసులు జారీచేసే అవకాశం ఉంది.
సీఆర్‌పీసీ సెక్షన్ 164 ఏం చెబుతోందంటే?
నేర విచారణ చట్టం(సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నేరుగా నమోదు చేస్తారు. ఈ సాక్ష్యం నమోదుకు ముందు ఆ సాక్షులతో ‘అంతా నిజమే చెబుతున్నామని, అబ ద్ధం చెప్పబోమని’.. న్యాయమూర్తి ప్రమా ణం చేయిస్తారు. స్వచ్ఛందంగా వాస్తవాలు మాత్రమే వెల్లడించాలని స్పష్టం చేస్తూ... వారు వెల్లడించిన అన్ని అంశాలను నమో దు చేస్తారు. ఈ వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్‌లో సదరు కేసును విచారిస్తున్న న్యాయస్థానానికి పంపుతారు. కేసు తుది విచారణ సమయంలోనూ ఇదే వాంగ్మూలాన్ని వారు న్యాయస్థానం ముందు ఇవ్వాల్సి ఉంటుం ది. ఇందుకు విరుద్ధంగా చెబితే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 193 కింద వారిపై కేసు నమోదు చేయవచ్చు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యమిచ్చినట్లుగా రుజు వైతే వారికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ముగ్గురి వాంగ్మూలాల నమోదు
స్టీఫెన్‌సన్‌తోపాటు జెస్సి కా, మార్క్‌టేలర్‌లు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు వీరి వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేశారు. ఈ సమయంలో ఎవరినీ కోర్టు హాలులోకి అనుమతించలేదు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కోర్టు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి.. తర్వాత మార్క్‌టేలర్, జెస్సికాల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ జెరూసలెం మత్తయ్య, రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీకి చెందిన కీలక నేతలు తనను ప్రలోభపెట్టిన తీరును స్టీఫెన్‌సన్ వివరించినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్‌లు తమ నివాసానికి వచ్చి రూ.50 లక్షలు ఇచ్చిన విషయాన్ని జెస్సికా, మార్క్‌టేలర్‌లు వివరించినట్లు సమాచారం.