
ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం
మధ్యమానేరు భూనిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం దిగొచ్చేదాకా ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు
రోడ్డెక్కిన మధ్యమానేరు నిర్వాసితులు
వంటావార్పునకుకదిలిన పల్లెలు
మద్దతు తెలిపిన నాగం, రేవంత్, పొన్నం, సింగిరెడ్డి
మార్చి 2న ఎమ్మెల్యే, 14న సీఎం నివాసాల ముట్టడి
వేములవాడ రూరల్ : మధ్యమానేరు భూనిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం దిగొచ్చేదాకా ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. పరిహారం, పునరావాసం విషయంలో న్యాయం చేయూలని, గతేడాది జూన్ 18న సీఎం కేసీఆర్ వేములవాడలో ఇచ్చిన హామీ మేరకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయూలని నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. మధ్యమానేరు ముంపు గ్రా మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేములవాడ మండలం రుద్రవరం పునరవాస కాలనీ వద్ద వంటావార్పు, ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. వేములవాడ, సిరిసిల్ల, బోరుునపల్లి మండలాల్లోని 12 గ్రామాల నిర్వాసితులు ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, టఫ్ నేత విమలక్క, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. నిర్వాసితులతో కలిసి రోడ్డుపై భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయనుకున్న ప్రజలకు కేసీఆర్ పాలనతో నిరాశే మిగిలిందని నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి హక్కులు ఇవ్వకుండా తన బంధువులతో రాబంధు పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ముంపు గ్రామాల న్యాయమైన డిమాండ్‌ను నెరవే ర్చేవరకు జెండాలు ఎజెండాలు పక్కన బెట్టి, ఐక్యవేదిక ద్వారా ఉద్యమాలను చేపడదామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గతేడాది జూన్ 18న వేములవాడ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మార్చి 2న వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు ఇంటి ముందు నిరసన తెలుపుతామని, 14న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు రవీందర్, పిల్లి కనకయ్య, కూస రవీందర్, ఎర్రం నర్సయ్య పాల్గొన్నారు.