యాలాల (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా యాలాల మండల రెవెన్యూ అధికారులు గురువారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఇందుకు సంబందించి ఆర్‌ఐ చాంద్‌పాష తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల పరిధిలోని బొల్లవన్‌పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక(17) తన అమ్మమ్మ గ్రామమైన అగ్గనూరు మల్‌రెడ్డిపల్లిలో ఉంటోంది. స్థానిక అగ్గనూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటోంది.
అయితే తన సమీప బంధువైన గంగుల బుగ్గప్పతో వివాహాం చేసేందుకు ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి మైనర్ కావడంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు. వధూవరులతో పాటు వారి కుటుంబ పెద్దలకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఆర్‌ఐ చాంద్పాష తెలిపారు.