
సాక్షి, హైదరాబాద్: బయో టెక్నాలజీ, బయో ఫార్మా రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో ప్రవేశించే పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో బీ–హబ్‌ను ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రూ.60 కోట్ల వ్యయంతో ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
బయో ఫార్మా రంగ పరిశోధనలకు ఊతమిచ్చేలా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం దేశంలోనే తొలిసారని.. హబ్ ఏర్పాటుతో సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలలు, పరిశోధనల కోసం ఇంక్యుబేటర్, ఉత్పత్తి సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. బీ–హబ్ ఏర్పాటుపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీ–హబ్‌తో బయో ఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు.
స్వదేశీ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచంలో బయో ఫార్మా రంగంలో ముందున్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్థాయిలో పరిశోధన, తయారీ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బయో ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తున్న ఔత్సాహికులు తమ పరిశోధన ఫలితాలను ఉత్పత్తి దశకు తీసుకెళ్లడంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు బీ–హబ్ పరిష్కారం చూపనుందని మంత్రి వివరించారు.
హైదరాబాద్ స్థానం సుస్థిరం
ఫార్మా పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన బిజినెస్ ప్లానింగ్, జీవ కణాలపై పరిశోధనలు, ప్రాసెస్ డెవలప్‌మెంట్, రిస్క్ అసెస్‌మెంట్ లాంటి అనేక అంశాల్లో బీ–హబ్ ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్న నగరంలోని ఔషధ పరిశ్రమలకు ఈ హబ్ ఊతమిస్తుందని పేర్కొన్నారు.
ఫార్మా కంపెనీల ప్రీ క్లినికల్ అధ్యయనాల కోసం బయో ఫార్మా స్కేల్ అప్ ప్రయోగశాలతోపాటు సెల్ లైన్ డెవ లప్‌మెంట్, క్లోన్ సెలక్షన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ డెవలప్‌మెంట్, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అనేక సదుపాయాలు హబ్‌లో అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని చెప్పారు. దేశంతోపాటు ఆసియా ఖండంలోనే ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జినోమ్ వ్యాలీలో ఇప్పటికే 200పైగా కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.
పదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఔషధ, బయో టెక్నాలజీ కంపెనీలకు అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే బీ–హబ్‌తో ఆయా కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు నిర్వహించి ఉత్పత్తులు తయారు చేసేందుకు, మార్కెట్ చేసేందుకు, సమయాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా ఉందని, రానున్న పదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఈ దిశగా ఇప్పటికే జినోమ్ వ్యాలీ 2.0, హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్ట్, లైఫ్ సైన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టనున్న బీ–హాబ్ తమ లక్ష్యాలు అందుకోవడంలో విజయవంతం అవుతుందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.